వైసీపీ విముక్త ఏపీకి రాష్ట్ర ప్రజలు కలిసి రావాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇంటింటికి వచ్చి స్టిక్కర్లు అంటించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మరోసారి టోపీలు పెట్టడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జగన్ అవసరం ఏముందని ప్రజలు నిలదీయాలని మనోహర్ అన్నారు. ‘‘సంపద సృష్టి అనే విషయాన్ని పక్కన పెట్టి అప్పులతో రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారు.
బటన్లు నొక్కుతూ కాలం గడుపుతున్న జగన్ ఈ రాష్ట్రానికి వద్దు. వచ్చిన ఆదాయం అంతా అప్పులు, వాటి వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. రెవెన్యూ లోటు దారుణంగా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రం మీద రూ.9.61 లక్షల కోట్ల అప్పు ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో రూ.2.61 లక్షల కోట్లను సంక్షేమ పథకాలకు వినియోగించారని సీఎం చెబుతున్నారు. మరి అప్పులు చేసిన మిగిలిన డబ్బు ఏమైపోయింది? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, సంక్షేమం ముసుగు వేసిన ఈ సీఎం మళ్లీ వద్దే వద్దు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపి తర్వాత రాజధానే లేకుండా చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేనే లేదు’’ అని అన్నారు.