ఇది ఎన్నికల ఫీవర్. మామూలుగా కాదు. దేశమంతా ఇప్పుడు ఎన్నికల మీదే చర్చ. ఏపీలోనైతే.. అటు అసెంబ్లీ ఎన్నికలు.. ఇటు లోక్ సభ ఎన్నికలు. దీంతో ఏపీలో కూడా ఎన్నికల జోరు నడుస్తోంది. పార్టీలన్నీ ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. నేతలు కూడా ఏ పార్టీలోకి వెళ్తే బెర్తులు దొరుకుతాయి.. పదవులు దక్కుతాయి.. అంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. జగన్‌నే సీఎం చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగూ కాంగ్రెస్ పార్టీలోనే రెండు సార్లు సీఎంగా పనిచేశారు. జగన్ కూడా కాంగ్రెస్‌తో కలిసి పని చేసిన వ్యక్తే. ఆయనకు కాంగ్రెస్ కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌తో కలిసేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేనే స్వయంగా వెళ్లి జగన్‌తో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై మాట్లాడుతా. కాకపోతే.. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్‌తో కలవచ్చు. ఆయన కూడా ఓకే అంటే అధిష్ఠానంతో మాట్లాడటానికి నేను రెడీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి తమ్ముడే కదా. ఇదివరకు ఎస్పీ, బీఎస్పీ పార్టీలను కలిపిందే నేను.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చింతమోహన్. తిరుపతిలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.