ఏపీలో 164 సీట్లలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది టీడీపీ కూటమి. ఈ విజయంతో చంద్రబాబు కూడా ప్రజల పట్ల బాధ్యతగా నడుచుకుంటున్నారు.అయితే కొందరి ఎమ్మెల్యేల తీరు చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.వైసీపీ నేతలు చేసిన పని, దూకుడుగా ముందుకు వెళ్లడం వంటి చర్యలను తగ్గించుకోవాలని చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కట్టు దాటుతుండడం చంద్రబాబుకి ఆందోళన కలిగిస్తోంది.కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అవుతుండడం పై చంద్రబాబు అసహనం వ్యక్తపరుస్తున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆదిమూలం పై వేటు పడింది. లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఇప్పుడు మరికొందరు కూడా కట్టు దాటడంతో ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారింది.ఏపీ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి భార్య పోలీసులపై రుబాబు చేశారు. దీంతో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి వచ్చింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సదరు మంత్రికి చంద్రబాబు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పై సైతం సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురైనట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వ్యవహార శైలి సైతం హాట్ టాపిక్ గా మారుతోంది. కొంతమంది డ్వాక్రా మహిళల విషయంలో ఆయన వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది. వైసిపి దీనినే హైలెట్ చేస్తోంది. రాష్ట్రస్థాయిలో ప్రచారాస్త్రంగా మారుతోంది. ఈ ఎమ్మెల్యేకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. అమరావతి ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అది నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారన్న విమర్శ ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారుతుండడం విశేషం.
ఎమ్మెల్యేల తీరు అలా ఉంటే టీడీపీ,జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు,నేతల మధ్య చేలరేగుతున్న వరుస వివాదాలు చంద్రబాబుకి తీవ్ర తలనొప్పిగా తయారయ్యాయి.ఏపీలో నిత్యం ఏదో ఒక చోట ఇరు పార్టీల కార్యకర్తలు కొట్లాడుకుంటున్నారు.పిఠాపురం,చిత్తూరు,తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా మచిలీపట్నంలో ఓ కేసు విషయమై జనసేన కార్యకర్త చేత టీడీపీ నేత కాళ్ళు పట్టించారు. ఈ సంఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.సమాచారం తెలుసుకున్న టీడీపీ అధినేత మచిలీపట్నం నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు. కొల్లు రవీంద్రతో వెంటనే ఫోన్ మాట్లాడిన చంద్రబాబు ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారట.స్వయంగా అధినేత లైన్‌లోకి రావడంతో ఆగమేఘాల మీద కొల్లు రవీంద్ర నియోజవకర్గానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు.