గత ఎన్నికల్లో ఘోర ఓటమి కావొచ్చు…ఈ సారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని అర్ధమవ్వడం కావొచ్చు…టీడీపీలో చంద్రబాబు అనూహ్య మార్పులు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. మొన్నటివరకు నేతలకు అవకాశం ఇచ్చారు..సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది చూసుకున్నారు. కానీ ఎవరైతే సరిగ్గా పనిచేయడం లేదో వారిని ఇప్పుడు మొహమాటం లేకుండా పక్కన పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
పైగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి నేతలు లేరు..అలాంటి చోట్ల కూడా కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో నెక్స్ట్ గానీ జనసేనతో పొత్తు ఉంటే….ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాలి. అలా కేటాయించే సీట్లలో టీడీపీ నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించడం లేదు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్‌లో ఇంచార్జ్‌ని పెట్టలేదు…అక్కడ సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించారు. ఖచ్చితంగా ఈ సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే భీమవరంలో కూడా ఇలాంటి మార్పే చేశారు.
నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉన్న తోట సీతారామలక్ష్మీకి భీమవరం బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నాటికి ఈ సీటు జనసేనకు కేటాయించవచ్చు. ఇవే కాదు పలు నియోజకవర్గాల్లో జనసేనకు వీలుగా చంద్రబాబు టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో నాయకత్వ మార్పులు చేస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డికి మాచర్ల బాధ్యతలు అప్పగించారు. ఇటు విశాఖ సౌత్‌లో గండి బాబ్జీకు బాధ్యతలు అప్పగించారు. అలాగే చిత్తూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లె, మడకశిర, నెల్లిమర్ల, కర్నూలు సిటీ నియోజకవర్గాల్లో కూడా కొత్త నాయకులకు అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అందుకే పనిచేయని నాయకులని ఎలాంటి సందేహం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు. మరి ఈ మార్పులు టీడీపీకి కలిసొస్తాయో లేదో చూడాలి.