ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సీఎం జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇక తమకు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఎలాగైన గెలవాలన్న ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే… ప్రలోభాలకు తెర లేపారు. కూటమి ఏర్పడినా ఏ రోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి తిరిగిన దాఖలాలు లేవు. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వానికి తెర తీశారు.
ఎన్నికల ప్రవర్తన నియామావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే తాము గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెప్పుకునేందుకు ఏమీ లేక తాయిలాలను టీడీపీ నమ్ముకుంది. తమ ప్రభుత్వ హయంలో ఫలానా పనులు చేశాం. ఓట్లు వేయండి అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఓటర్లకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేస్తు ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వెదజల్లి ప్రత్యర్థి పార్టీకి చెందిన చోటామోటా నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతకు 5 లక్షల నుంచి పది లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి కార్యకర్తలకైతే లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. కులాల వారీగా నాయకులను ఎన్నికల వేళ ప్రలోభపెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీగా తాయిలాలు ప్రకటించడమే కాక ముఖ్యమైన వారికి విందులు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వార్డుల్లోని ముఖ్యులను పిలిపించుకొని ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి కానుకలు పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.