టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా అర్ధరాత్రో అపరాత్రో కాకుండా.. అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఉదయం 7 గంటల తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్టు చేయడం అన్నది టీడీపీకి మామూలు షాక్ కాదు. ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీ అని బాంబు పేల్చి బాబు & కో లకు నిద్రలేకుండా చేసిన జగన్ సర్కార్… అచ్చెన్నని అరెస్ట్ చేయడంతో దాని తీవ్రత పెంచిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే… అచ్చెన్నాయుడి అరెస్టు అనంతరం స్పందించిన టీడీపీ నేతల మాటలే హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు.
ఒక బీసీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు… ఇది రాజారెడ్డి రాజ్యాంగం… ఇది రాక్షస పాలన… టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు… జగన్ బెదిరింపులకు భయపడేది లేదు… అంటూ టీడీపీ నేతలు మైకులముందుకు వచ్చారు. “అచ్చెన్న బీసీ సామాజివర్గానికి చెందినవారు కాకపోయినా కూడా ఈ స్కాం బయటపడేది.. అందులో ఎవరు ఉన్నా ఇదే జరిగేది” అని వైకాపా నేతలు చెబుతున్నారు.
ఈ సమయంలో రామ్మోహన్ నాయుడు మైకందుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఆయన చేసిన తప్పా? అణచివేతకు గురైన బీసీ వర్గాల గొంతుకగా తన గళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నని సభలో ఎదుర్కొనే సత్తా వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు లేదా? అందుకే అరెస్టు చేశారా? అంటూ ప్రశ్నల వర్షాలు కురిపించారు.
ఇక్కడ రామ్మోహన్ నాయుడు గమనించాల్సింది ఏమిటంటే… ఇప్పుడు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది… ప్రతిపక్షంలో ఉన్న టిడీపీ ఎమ్మెలేగా అసెంబ్లీలో బలంగా మాట్లాడుతున్నందుకు కాదు… ఆ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు చేసిన అవినీతి గురించి!
ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందుకు కాదు… ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మును పాడుచేసినందుకు!
బీసీ వర్గాల గొంతుకగా తన గళాన్ని వినిపిస్తున్నందుకు కాదు… చిన్న చిన్న ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే మెడికల్ ట్రీట్ మెంట్ కు సంబందించిన మందులు, ఆపరేషన్ సామాగ్రిల కొనుగోలు విషయంలో అవకవతవకలు పాల్పడినందుకు!
ఈ విషయాలు మరిచిన టీడీపీ నేతలు.. ఇన్ని రోజులూ నిరూపించండి, ధమ్ముంటే అవినీతిని నిరూపించండి అన్న టీడీపీ నేతలు… జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టేసరికి ఇలా మైకులముందు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు! చట్టం తనపని తాను చేసుకుపోతున్నప్పుడు ఇలా మాట్లాడటం సబబా తమ్ముళ్లు!