ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఏ సమాచారం లేదా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్ కూడా గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ ని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వానికి కూడా హక్కు ఉంటుందని, తమకు ఒక్క మాట కూడా వాయిదా వేయడం ఏంటీ అంటూ జగన్ ఫిర్యాదు చేసారు.
ఈసీ మీద ఒత్తిడి ఎక్కువైంది కాబట్టే వాయిదా వేసారని కొందరు అంటున్నారు. ఎన్నికల కమీషనర్ రమేష్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఆరు వారాల పాటు ఏ విధంగా వాయిదా వేసారని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎన్నికల కమీషనర్ తో మాట్లాడాలని జగన్ ప్రయత్నాలు చేసినా సరే ఆయన జగన్ కి అందుబాటులోకి రాలేదని అంటున్నారు. గవర్నర్ దృష్టికి కూడా ఇదే విషయం జగన్ చెప్పారట. దీనిపై టీడీపీ నేతల కుట్ర ఉంది అనే విషయాన్ని కూడా జగన్ చెప్పినట్టు సమాచారం.
రాజకీయంగా ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతుంది. ఊహించని విధంగా ఎన్నికలు అంత సమయం వాయిదా పడటం పై వైసీపీ నేతలు ఇప్పుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం జగన్ మీద కుట్ర చేస్తుంది అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం కీలక అధికారులను తప్పించడం కూడా ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వాధినేతకు చెప్పకుండా ఎన్నికల సంఘం వాయిదా వేయడం మాత్రం ఇప్పుడు సంచలనమే.