తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబులు కుట్ర చేశారని బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలతో మంథని నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ విషయం పై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర డీజీపీ ని కోరారు. గత రెండు రోజులుగా బీజేపీ నాయకుడు చేసిన అసత్య ఆరోపణలు, రాజకీయ లబ్ధికోసం ఎంతకైనా దిగజారిపోయే నీచ సంస్కృతి చూస్తుంటే ఆశ్యర్యమేస్తోందని తెలిపారు.
సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి పెరిగిపోయిందని.. ఇలాంటి నీచ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సామాజిక మాద్యమాల్లో చేసిన అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలని.. నిస్పక్షపాతంగా వ్యవహరించి నిజనిజాలను వెలికితీయాలని వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర డీజీపీ ని శ్రీధర్ బాబు లిఖిత పూర్వకంగా కోరారు.