తెలంగాణ పోరాట ఉద్యమ సూరీడు..ప్రత్యేక రాష్ట్ర కార్య సాధకుడు

-

ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ సొంతం. ఉద్యమకారుడిగా సామాన్యుల్ని ఉర్రూతలూగించినా.. అన్ని పార్టీలూ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి కల్పించినా.. ముఖ్యమంత్రిగా పాలనాదక్షత నిరూపించుకున్నా అది ఆయనకే చెల్లింది. ఉద్యమకారుడు సమర్థ పాలకుడు కాలేడన్న అపోహలకు ఆయన తెరదించారు. తెలంగాణ వచ్చేదాకా టీఆర్ఎస్ ను ఉద్యమపార్టీగా నడిపిన కేసీఆర్.. ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి తనదైన వ్యూహాలతో ఎదురులేని పార్టీగా నిలిపారు. ఉద్యమం, పాలన, రాజకీయం.. ఇలా ఏం చేసినా.. తనకు తానే సాటి అనిపించుకున్నారు కేసీఆర్.

తెలంగాణ ఉద్యమానికి సంబంధించి.. 1969 వరకు ఒక చరిత్ర. ఆ తర్వాత ఒక చరిత్ర. 1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత, ఆశలన్నీ సన్నగిల్లిన వేళ.. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఎదురు చూశారు. సరిగ్గా అప్పుడే గులాబీ జెండాతో కేసీఆర్ బయల్దేరారు. చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది.

2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మైలురాయి. కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమ చరిత్రలో ఇది కీలక మలుపు. 2009 డిసెంబర్‌ 9న నాటి హోం మంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

ఉద్యమకారుడిగా కేసీఆర్ వ్యూహాలు కూడా అనూహ్యమైనవి. అప్పటివరకూ ఉద్యమాలు ఇలా కూడా చేయొచ్చని ఎవరి ఊహకూ అందని పద్ధతుల్ని ఆయన అవలంబించారు. రాస్తారోకోలు, హర్తాళ్ల నుంచి బతుకమ్మలు, వంటావార్పు, రోడ్ల దిగ్బంధం, సకల జనుల సమ్మె, ఇలా ఉద్యమానికి బహురూపాలు ఇవ్వడంతో పాటు.. ఎప్పటికప్పుడు తీవ్రత పెంచడంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో అన్ని వర్గాలు మమేకమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకోసం ఉద్యమ భాష, యాస, గోసపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా.. తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు.

సాధారణంగా ఉద్యమ నేతలుగా ఉన్నవాళ్లు పాలకులుగా రాణించలేరనే అపోహ ఉంది. కానీ కేసీఆర్ అది తప్పని నిరూపించారు. ఉద్యమ నాయకుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. ముఖ్యమంత్రిగా కూడా అంతే పాలనా దక్షుడు అనిపించుకున్నారు. తెలంగాణలో అటు ఐటీని, ఇటు వ్యవసాయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. దశాబ్దాలుగా చిక్కుముళ్లుగా ఉన్న సమస్యల్ని పరిష్కరించారు. అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వ్యతిరేకిగా ముద్రపడ్డ కేసీఆర్.. ముఖ్యమంత్రిగా మాత్రం అందరివాడుగా మన్ననలందుకుంటున్నారు.

ప్రత్యర్థులు అనుకున్న వ్యూహాన్ని అమలు చేయకముందే.. ఎదురుదాడి చేసి.. ప్రతివ్యూహంతో ఉక్కిరిబిక్కిరి చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. మొదట తెలంగాణలో టీడీపీకి అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని పెద్దఎత్తున టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో కలకలం రేగింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ అమలు చేసిన రాజకీయ వ్యూహం ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించింది. తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నంతగా ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా రాజకీయ వ్యూహాలు అమలు చేశారు కేసీఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version