కేసీఆర్ కు కరోనా రావడంతో ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాకపోతే రెస్ట్ తీసుకోకుండా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే ఫోన్ లు చేస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ.. వాటిని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఇన్ చార్జి మంత్రులను నియమించి నిత్యం వారితో టచ్ లో ఉంటున్నారు.
అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ లు ఇచ్చి ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లేలా ప్లాన్ వేస్తున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు టీఆర్ ఎస్ కు మంచి పట్టున్న నియోజకవర్గాలు కావడంతో అన్ని చోట్లా గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారితో సంధి చేసుకునేలా ఆదేశాలు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ లో ఓ మహిళా కార్యకర్త తనకు టికెట్ రాకపోవడంతో పెట్రోల్ డబ్బతో బిల్డింగ్ ఎక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా సజావుగా ఎన్నికలు జరపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఈటల రాజేందర్ లకు ప్రత్యేక టార్గెట్ ఇచ్చి వారి జిల్లాల్లోని ఎన్నికలు గెలవాలని ఖచ్చితమైన టార్గెట్ లు కూడా ఇచ్చారు. వారికి ఎమ్మెల్యేలను జత చేస్తూ.. మిగతా మంత్రులను కూడా ప్రచారానికి పంపిస్తున్నారు. ఇక కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఐసోలేషన్ లోనే ఉంటూ ఎన్నికలను ఫాలోఅప్ చేస్తున్నారు. నేటితో ప్రచారానికి తెర పడుతుండటంతో.. నాలుగు రోజుల్లో జరిగే పోలింగ్ కు పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలో వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్, కేటీఆర్. ఇక పోల్ మేనేజ్ మెంట్ అంటేనే టీఆర్ ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. దీంతో ఖచ్చితంగా తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్న ధీమాతో వారు ఉన్నారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బీజేపీకి, కాంగ్రెస్ కు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పెద్దగా పట్టులేకపోవడంతో అన్ని చోట్లా గెలిచి వారికి చెక్ పెట్టాలని గులాబీ బాస్ గట్టి పట్టుమీద ఉన్నారని సమాచారం.