ఇక్కడ ఒకలా.. అక్కడ మరోలానా..? థరూర్‌పై కాంగ్రెస్‌ ఫైర్

-

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రవర్తనపై ఆ పార్టీ హైకమాండ్ ఫైర్ అయింది. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసిన థరూర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. తమ ముందు ఒకలా మీడియా ముందు మరోలా ప్రవర్తించారని మండిపడింది.

‘మీరు మా ముందు ఒకలా, మీడియా ముందు ఒకలా ప్రవర్తించారని చెప్పేందుకు విచారిస్తున్నాం. మా సమాధానాలతో సంతృప్తి పడినట్లు మా ముందు వ్యవహరించారు. మాపై ఆరోపణలు చేసి, అక్కడ మరోలా ప్రవర్తించారు. మేం మీ అభ్యర్థనలను అంగీకరించాం. అయినా సరే.. కేంద్ర ఎన్నికల సంఘం(కాంగ్రెస్‌) నాకు వ్యతిరేకంగా వ్యవహరించిందంటూ మీడియా ముందుకు వెళ్లారు’ అని థరూర్ బృందానికి కాంగ్రెస్ ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఘాటుగా సమాధానమిచ్చారు.

బుధవారం రోజున ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, థరూర్‌ రిగ్గింగ్ ఆరోపణలు చేశారు. ‘కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయంలో తప్పులు జరిగాయని.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీని గురించి మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించామని.. కానీ ఫలితం లేదని.. అందుకే ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ థరూర్ బృందం రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది.

ఇది చర్చనీయాంశం కావడంతో ఆ వెంటనే థరూర్ కూడా స్పందించారు. ఎన్నికల సంఘానికి అంతర్గతంగా రాసిన లేఖ మీడియా బహిర్గతం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకేనని, అంతా కలిసి ముందుకువెళ్దామని అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version