ఏపీలో క‌ల‌క‌లం… బీజేపీలోకి న‌లుగురు మాజీ ఎంపీలు….!

-

కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ తెలుగు రాష్ట్రాలపై కన్నెసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కమలంతో పేరుతో ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఏపీలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులని, మాజీ ఎమ్మెల్యేలని, సీనియర్ నేతలనీ పార్టీలోకి లాగేసుకుంది. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులని చేర్చుకుంటూ బలపడుతుంది. ఇంకా నేతలనీ చేర్చుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మాజీ వివేక్ కి అమిత్ షా పార్టీ కండువా కప్పారు. ఈయన తర్వాత మరికొందరు నాయకులు బీజేపీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది.

Four Andhra Pradesh leaders join BJP

తెలంగాణ సంగతి అలా ఉంచితే ఏపీలో టీడీపీకి చెందిన కొందరు మాజీ ఎంపీలకి గేలం వేస్తోంది. ఇప్ప‌టికే టీడీపీకి మెయిన్ ఫిల్ల‌ర్లుగా ఉన్న న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను లాగేసుకున్న బీజేపీ ఇప్పుడు మాజీ నేత‌ల‌పై గురి పెట్టింద‌ట‌. అందులో ముఖ్యంగా సీమలో బలమైన నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీలో రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మొన్న ఎన్నికల ముందే కోట్ల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఓటమి పాలైన వీరికి జిల్లాలో మంచి బలం ఉంది. అందుకే కోట్ల ఫ్యామిలీని లాగేయాలని చూస్తోంది.

కోట్లతో పాటు టీడీపీలో ఉన్న మరో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై కూడా బీజేపీ కన్నుంది. ఇప్పటికే ఆయనతో పార్టీ పెద్దలు చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతానికి ఆయ‌న సైలెంట్ గా ఉన్నారు. కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం టీడీపీతో భేర‌సారాలు ఆడుతున్న ఆయ‌న అక్క‌డ డీల్ తేడా వ‌స్తే ఎప్పుడైనా బీజేపీలోకి జంప్ చేసేయ‌వ‌చ్చు. అలాగే బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిని బీజేపీ టార్గెట్ చేసుకుంది. మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత మాల్యాద్రి సైలెంట్ గా ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ ఆయనకి గేలం వేస్తోంది. ఆయ‌న మాజీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రికి అత్యంత స‌న్నిహితుడు.

ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మరో సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మిని కూడా బీజేపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆమె మొన్న ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పనబాక కుటుంబాన్ని చేర్చుకుంటే నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో బలం పుంజుకోవచ్చని బీజేపీ భావన. ఈ మాజీ ఎంపీలనే కాకుండా బీజేపీ, టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిపై కూడా వల వేస్తోంది. పైగా నానికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. దాంతో పాటు గెలిచిన దగ్గర నుంచి నాని సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ కాక పుట్టిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాని కాషాయ జెండా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి బీజేపీ గేలానికి ఎంతమంది చిక్కుతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version