చదువుల దివ్వెలకు కొత్త వెలుగులు ఆపాదించాలని అనుకున్నారు. అందించాలని పరితపించారు. ఆ విధంగా ఈసారి చదువులు బాగానే ఉంటాయి అని అనుకున్నారు. నాడు నేడు పేరిట బళ్లు అన్నీ కొత్త రూపు మరియు రేఖను సంతరించుకున్నాయి. పేరెంట్ అయితే ఎంతో ఆనందంగా ఉన్నడు కూడా ! కానీ బడి బాగున్నా రెండేళ్ల కరోనా కారణంగా చదువులు అన్నీ వెనుకబడిపోయాయి. ఆన్లైన్ లో ప్రభుత్వ బడుల నిర్వహణ అన్నది జరగని పని. వీలున్నంత వరకూ పేదలు, మధ్య తరగతి బిడ్డలు బడికే రావాలి. ఇక్కడే చదవాలి. ఇక్కడే డౌట్స్ రెక్టిఫై చేసుకుని వెళ్లాలి. కానీ చదువులు అన్నీ చట్టుబండలయ్యాయి. వీటితో పాటు క్రియా ప్రధాన పాఠ్య పుస్తకాలు (యాక్టివిటీ బేస్డ్ టెక్స్ట్ బుక్స్) కావడంతో కొందరికే ఈ రకం చదువు చేరువ అవుతోంది. కొందరి ఉపాధ్యాయుల తీరు కారణంగా ఆ చదువు కూడా చేరువ కాలేకపోతోంది. దీంతో ఈ సారి చదువు అటకెక్కిపోయింది. అందిరాకుండా పోయింది. అందుకోకుండా పోయింది.
ఈ నేపథ్యాన ఆంధ్రావని వాకిట పది ఫలితాలు వెల్లడి అయిన వెంటనే పలు సందేహాలు మరియు అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. దీంతో విపక్షాలు వస్తున్న ఫలితాలను అనుసరించి రేపటి వేళ అయినా ప్రభుత్వ విద్యలో మార్పులు వస్తాయా అని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో చదువులు అంటూ ఊదరగొడుతున్న ఏపీ సర్కారు ఇప్పటికా సాధించిందేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదే సందర్భంలో
మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయనేమన్నారంటే…
చదువురాని వాడు కాకరకాయ అంటే చదువువచ్చిన వాడు కీకరకాయ అన్నాడట ! ఇంగ్లీష్ మీడియంలో చదివాక ఉన్నమతి పోయినట్టు… ! పదో తరగతి పరీక్షల్లో 67 శాతం ఏంటి సర్? 71 పాఠశాలల్లో 100 శాతం ఫెయిల్ ఏంటి సర్? నిరక్షరాస్య రాష్ట్రం చేస్తామని ఎన్నికల్లో మీరు హామీ ఏమైనా ఇచ్చారా? ఇప్పటికే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామని చెబుతున్నారు కదా!అలానే ఈ హామీ ని కూడా నెరవేర్చారా అనే సందేహమే! సెటైర్ కాదు, ఏమీ అనుకోకండి…అని విద్యాశాఖ మంత్రి బొత్సనూ, సీఎం జగన్ నూ ఉద్దేశించి అన్నారు.
2015 లో 91.42 శాతం, 2016 లో 93.26 శాతం, 2017 లో 91.92 శాతం, 2018 లో 94.48 శాతం, 2019 లో 94.88 శాతం… ప్రతీ ఏడాదికేడాది స్థిరమైన, గణనీయమైన ప్రగతిని సాధించిన చరిత్ర కు పాతరేస్తూ నాణ్యమైన విద్యను అందించడం లో మొదటి నుంచి మూడో స్థానం లో ఉన్న రాష్ట్రాన్ని చివరి నుంచి మూడో స్థానానికి దిగజార్చేలా సాగుతున్న మీ పాలనను సంస్కరించి మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాం..అని కూడా అన్నారాయన.
నాడు – నేడు అని స్కూళ్ల రూపు రేఖలు మార్చామని చెబుతున్నారు కానీ విద్యార్థుల తలరాతలను కాలరాస్తున్నారు. టీచర్లకు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేదు. 5 తరగతులకు ఒకే టీచర్, కిండర్ గార్డెన్ నుంచి 3 వరకు ప్రాథమిక విద్య అనీ, తర్వాత హై స్కూల్ అనీ ఏవేవో చెప్పారు. ఆఖరికి టీచర్లచేత పిల్లలకు పాఠాలు చెప్పడం మానిపించి బాత్ రూం ల క్లీనింగ్ ల నుంచి, భోజనాలు వడ్డింపు వరకూ ఫొటోలు అప్లోడ్ చేయడం లో బిజీ గా మార్చారు. ఈ సందర్భంలో అయినా మీ విధానాలను సమీక్షించండి సర్. ఒక్క డీఎస్సీ లేదు. ఒక్క ఓరియంటేషన్ లేదు. ఒక్క ప్రణాళిక లేదు. రాజకీయం చేస్తున్నామని అనుకోవద్దు. రాజీలేని ప్రయత్నం చేద్దాం. మా సహకారం కావాలన్నా అందించేందుకు మాజీ విద్యాశాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నాను.. అని చెప్పారాయన.