స్టీరింగ్ వ‌ణుకుతోంది.. ఆధిక్యం అత్య‌ల్పం.. 6,066 ఓట్లే

-

దుబ్బాక ఎన్నిక‌ల త‌రువాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ గ్రేట‌లో కూడా తన ఊపు కొనసాగించింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కంటే అధికార టీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 0.18శాతం ఓట్లు మాత్ర‌మే ఎక్కువ సాధించింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మొత్తం 34,44,093 ఓట్లు పోల్ అవ‌గా చెల్ల‌నివి 79,735 ఓట్లు, 28,661 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక పార్టీల వారిగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి 11,92,162( 35.73 %), బీజేపీ కి 11,86,096 ( 35.55 % ), ఎంఐఎం పార్టీకి 6,30,867 (18.91%), కాంగ్రెస్ పార్టీకి 2,20,504 (6.61%), టీడీపీకి 55,287 (1.65 %) ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఓట్ల వ్య‌త్యాసం కేవ‌లం 6,066 ఓట్లు మాత్ర‌మే.

ఈ ఎన్నికల్లో కారు, కమలంల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ జ‌రిగింద‌నే కంటే కూడా బీజేపీ అటు ఎంఐఎం పార్టీతో ఇటు టీఆర్ఎస్ పార్టీతో త‌ల‌పడింద‌ని చెప్పొచ్చు. పాత బ‌స్తీలో కూడా బీజేపీ గ‌తంలో కంటే కూడా మెరుగైన ఓట్లు సాధించింది.

2016లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే టీఆర్‌ఎస్‌.. 42% ఓట్లతో 99 స్థానాల్లో గెలుపొంది మేయ‌ర్ పీఠాన్ని సింగిల్‌గా అధిరోహించింది. ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ దాదాపుగా 6 % ఓట్లని కోల్పోయి 34.62% ఓట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 2016 ఎన్నిక‌ల‌తో పోలిస్తే 24 % ఓటు బ్యాంకును పెంచుకుంది. టీఆర్ఎస్ గెలిచినా, ఎంఐఎం గెలిచినా కూడా 79 డివిజ‌న్ల‌లో రెండో స్థానంలో బీజేపీ ఉండ‌టం గ‌మ‌నార్హం. 100 తక్కువ ఓట్లతో 2 సీట్లు, 500 కన్నా తక్కువ ఓట్లతో 5 సీట్లు, వెయ్యి కన్నా తక్కువ సీట్లతో మరో 5 సీట్లను బీజేపీ కోల్పోయింది.

ఒక‌ప్పుడు 100 ఓట్లు ప‌డ‌ని పార్టీకి నేడు 100 ఓట్ల మెజారిటీ వ‌చ్చిందంటే..? స‌మ‌జైతుందా?? మ‌్యాట‌ర్ ఏందో..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు ప‌డుతున్నాయి. మ‌రి అధికార టీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి ఎందుకు ఇంత దారుణంగా త‌యార‌య్యిందో విశ్లేషించుకుంటే మంచిద‌ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లే సోష‌ల్ మీడియాలో స‌ల‌హాలిస్తున్నారు. ముందునుండి పార్టీ కోసం ప‌నిచేసిన నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డమే ముఖ్య కార‌ణ‌మ‌ని కొంద‌రంటుంటే, వ‌ల‌స నాయ‌కుల ఆధిప‌త్యం వ‌ల్లేనంటున్నారు మ‌రికొంద‌రు. సీఎం కేసీఆర్ ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు భ‌జ‌న బ్యాచ్ త‌య్యార‌య్యిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ కోట‌రీని దూరం పెడితేనే మంచిదంటూ స‌ల‌హాలిస్తున్నారు.

ఎమ్మెల్యే, మంత్రిగిరి చేస్తున్న నాయ‌కులు త‌మ కుటుంబం నుంచి పోటికి దింపి గెలిపించుకోలేక‌పోవ‌డం వారి వారి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌మీద నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఎన్నిక‌లు ఏవైనా ఎమ్మెల్యేల కుటుంబీకులు పోటీ చేయ‌డం చూస్తున్నాం. ఈ నాయ‌కుల‌కు వ‌చ్చే సార్వ‌త్ర ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వం ఎదురు కావ‌చ్చంటూ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

టీఆర్ఎస్ ఇంటి పార్టీగా అభిమానించే తెలంగాణ స్థానాల్లో టీఆర్ఎస్‌కి వ్య‌తిరేకంగా ఫ‌లితాలు రావ‌డం, సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా రావ‌డం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు. గెలుపు ఓట‌ములు స‌హ‌జం అనుకొని ఆలోచించలేకుండా నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో కూడా ఈ డైలాగ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version