గ్రేటర్‌ వార్‌ ఎవరి పదవులకు ఎసరు పెడుతుంది ?

-

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కొందరు మంత్రులకు రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారిందనే చర్చ అధికారపార్టీలో జోరందుకుంది. ఇన్నాళ్లూ తమతమ నియోజకవర్గాల్లో గెలవడం ఒక ఎత్తు.. ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ అభ్యర్ధులను గెలిపించడం మరో ఎత్తు అన్నట్టుగా మారిందట. తమ నియోజకవర్గాల్లో అయితే.. అక్కడి ఆయువుపట్టులన్నీ వారికి తెలుస్తాయి. గెలిస్తే పదవులు.. ఓడితే ఇంటికే పరిమితం అవుతారు. ఇక్కడ అలా కాదు.. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించడం కత్తిమీద సాముగానే భావిస్తున్నారట మంత్రులు. ఏ మాత్రం అటు ఇటు అయినా ఇక అంతేనని అనుకుంటున్నారట.

చిలుకనగర్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, అంబర్‌పేటలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సరూర్‌ నగర్‌లో జగదీష్‌రెడ్డితోపాటు.. ఇతర మంత్రులకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. రాత్రి పొద్దుపోయే వరకూ డివిజన్లలో గల్లీగల్లీ తిరగడం.. ఉదయాన్నే అభ్యర్థికంటే ముందే మంత్రి రోడ్డుపైకి రావడం గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌ వీధుల్లో కామనైపోయింది. ఇన్నాళ్లూ మంత్రులు ఎప్పుడు కరుణిస్తారా అని పార్టీ నేతలు ఎదురు చూస్తే.. ఇప్పుడు మన అభ్యర్థి ఎక్కడ్రా బాయ్‌ గింతసేపు రాకపోతే ఎలా అని మంత్రులే రోడ్డెక్కి తమ చుట్టూ ఉన్నవారిని ప్రశ్నించే పరిస్థితి.

ఇవన్నీ చూసిన వారికి ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోందట. మంత్రులకు డివిజన్ల స్థాయిలో పెద్ద బాధ్యతలే అప్పగించారని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే ఉందట. తమకు అప్పగించిన డివిజన్లలో మంత్రులు పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోతే అది వారి పదవులకే ఎసరు తేవొచ్చని అనుకుంటున్నారు. అందుకే కొందరు మంత్రులకు నిద్ర కరువైందట. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నారు. ఒకవేళ మంత్రుల పనితీరు సరిగా లేక.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మెరుగైన ఫలితాలు సాధిస్తే జాతకాలు తిరగబడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కేబినెట్‌లో మార్పులకు చేర్పులకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేం. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో మంత్రుల పనితీరును ప్రాతిపదికగా తీసుకుని మంత్రివర్గ ప్రక్షాళణ చేపడితే మాత్రం చాలా మంది ఫీజులు ఎగిరిపోతాయి. ఇప్పటికే డివిజన్లలో ఎవరు బాగా పనిచేస్తున్నారు.. ఏంటన్నది నిఘా వర్గాలు ఆరా తీసి ఎప్పటికిప్పుడు పార్టీ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నాయట. గ్రేటర్‌ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు పదోన్నతి కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరగుతోంది. అందుకే గ్రేటర్‌ వార్‌లో అటు ఇటు అయితే ఎవరి మంత్రి పదవులకు ఎసరు వస్తుందో అన్న ఆసక్తి నెలకొందట.

టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఎన్నికల బాధ్యతలు చూస్తున్న అందరి దృష్టీ డిసెంబర్‌ ఒకటిన జరిగే పోలింగ్‌.. 4న వెల్లడయ్యే ఫలితాలపై ఉంది. వందకు పైగా డివిజన్లలో పాగా వేస్తామన్నది టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పే మాట. మరి.. సెంచరీ దాటించేందుకు టీమ్‌లో ఎవరి పనితీరు ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version