టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్ టెన్షన్ వెంటాడుతుంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న గుత్తా ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఉన్నారు. మంత్రి పదవికోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గుత్తాకి రాజకీయ సమీకరణాలు కుదరక రాజ్యాంగ బద్ద పదవితో సరిపెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవీకాలానికి సమయం దగ్గరపడుతుండటంతో అధినేత దృష్టిలో పడేందుకు గుత్తా రకరకాల ఫీట్లు చేస్తున్నారు.
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న గుత్తా కి మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరికగా అనుచరులు చెబుతుంటారు. ఎంపీ పదవిలో ఉండి టీఆర్ఎస్ లో చేరిన వెంటనే కేబినెట్ హోదా కలిగిన రైతు సమన్వయ సమితికి అధ్యక్షుడిని చేశారు కేసీఆర్. కొన్నాళ్లు ఆ పదవిలో నెట్టుకొచ్చినా.. ఆయనలో అసంతృప్తి ఏదో ఒక మూల ఉండిపోయిందట. తర్వాత కాలంలో శాసన మండలి ఛైర్మన్ అయ్యారు. ఇది రాజ్యాంగ పదవి. ఇప్పుడేమో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసే సమయం ఆసన్నమైంది. దీంతో కొత్త టెన్షన్ పట్టుకుంది.
మంత్రి కావాలన్న కోరిక ఏమో గానీ ఉన్న మండలి చైర్మన్ పదవి కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీగా ఉండాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధిష్ఠానం కరుణించి మరోసారి ఎమ్మెల్సీని చేస్తే ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ ఆశ సజీవంగా ఉండాలంటే కామ్‌గా ఉంటే కుదరదని భావించారో ఏమో ఈ మధ్య విమర్శలకు పదునుపెట్టారు. ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న జానారెడ్డిపైన, కాంగ్రెస్ పార్టీపైనా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నా.. కేసీఆర్ దృష్టిలో పడటం కోసం కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారని అనుచరులు గుసగుసలాడుతున్నారు.
ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు నల్లగొండ జిల్లాకు చెందినవే కావడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎక్స్‌టెన్షన్ ఉంటుందని చర్చ జరుగుతోంది. కాకపోతే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక తర్వాత మరో లెక్క అన్నట్టు పరిస్థితులు మారిపోయినట్టు గుత్తా శిబిరం అభిప్రాయపడుతోంది. ఎమ్మెల్సీ పదవి పై సాగర్ నేత కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో గుత్తాకి కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకే రాజ్యంబద్ద పదవిలో ఉండి విమర్శలకు పదును పెట్టారట. ఎమ్మెల్సీగా ఎక్స్‌టెన్షన్ పొంది మండలి చైర్మన్ గిరి కాపాడుకునేందుకు గుత్తా ఇంకెలాంటి ఎత్తుగడలు వేస్తారో అన్న చర్చ జిలా టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తుంది.