కొత్త జిల్లాల ఏర్పాటుతో ఫుల్ ఖుషీగా ఉన్నారు యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. స్థానిక పాలన కోసం తాము మరిన్ని చర్యలు చేపట్టనున్నామని కూడా అంటున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం అని చెబుతున్నారు. ఆ విధంగా జగన్ చెప్పిన మాటలు అన్నీ బాగున్నాయి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలకూ జగన్ చెప్పే సంభాషణలకూ అదేలేండి డైలాగులకూ అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు చాలా ఆర్థిక భారం.
ఆ వ్యయ ప్రయాసలను ఓర్చుకోవడం కానీ లేదా అందుకు అనుగుణంగా ఆర్థిక స్థితిని మార్చడం కానీ జరగని పని కానీ.. ముఖ్యమంత్రి ఇవేవీ చూడకుండా కేవలం రికార్డుల కోసం తన దైన పంతం నెగ్గించుకోవడం కోసం ఈ ప్రకటనను అమలు చేశారని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే పరిపాలన తీరు అస్తవ్యస్తంగా ఉంది. ఆయన చెబుతున్న గ్రామ సచివాలయ లేదా వార్డు సచివాలయ వ్యవస్థ అస్సలు బాలేదు.
అవి కూడా సమర్థ రీతిలో పనిచేయాలంటే ఇంకాస్త సమయం కావాలి. ఇక్కడ వలంటీర్ల పై రాజకీయ ఒత్తిడి ఉంది. అదేవిధంగా వలంటీర్లకూ,సచివాలయ సిబ్బందికీ వేతన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని రావడం ఇప్పట్లో కష్టం. కానీ జగన్ తన నిర్ణయం చాలా గొప్పది అన్న భావనతో ఉన్నారు. తన వారితో అదేపనిగా భజన కీర్తనలు పాడిస్తున్నారు.
ఇక గోదావరి జిల్లాల విభజన అస్సలు బాలేదు అన్న విమర్శలు విపరీతంగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పేరిట ఓ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కాకినాడ అని మరో జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగానే తమను తాము పిలుచుకునేందుకు ఇష్టపడతామని వీరంతా అంటున్నారు. పోనీ తాము చెప్పిన విధంగా కోనసీమ ప్రాంతానికి బాలయోగి పేరు కానీ లేదా అంబేద్కర్ పేరు కానీ పెట్టారా అంటే అదీ లేదు అని వీరంతా గగ్గోలు పెడుతున్నారు.
పశ్చిమ గోదావరిలో ఉన్న కొవ్వూరు ను కాస్త తూర్పులో కలిపారని ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లా అని వ్యవహరించడం తమకు అస్సలు ఇష్టం లేదని గోదావరి అన్న పదం లేకుండా జిల్లా ఏంటని వీరంతా బాధపడుతున్నారు.రాజకీయ అవసరాలు ప్రయోజనాలు ఈ రెండూ ధ్యేయంగానే కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు కానీ తమ ఉద్దేశాలు అభిప్రాయాలు పరిగణించలేదని వీరంతా వేదన చెందుతున్నారు. జిల్లాల విభజన కూడా అశాస్త్రీయతతో ఉందని వీరంతా గొంతెత్తుతున్నారు.