పార్టీ పేరు మార్చాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చాలా ఉన్నా పార్టీ పేరు మార్పు కూడా ఓ ప్రధాన కారణమని అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పేరుతోనే మరోసారి ఎన్నికలకు వెళ్లి ఉంటే అనుకూల ఫలితాలు వచ్చిఉండేవని కొందరి వాదన.
తెలంగాణ సాధించామని చెప్పుకున్న పార్టీలో అసలు లోకల్ వాదమే లేకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. అందుకే పార్టీ పేరును మార్చాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని సంకేతాలు ఇచ్చేందుకే హరీష్ టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు అని టాక్ నడుస్తోంది. హరీష్ రావు కండువా మార్చడంతో పెద్ద చర్చే కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చడంపై కార్యకర్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చడంతో స్థానిక వాదం బలహీనపడిందని.. ఈ కారణంతో నే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం బలంగా చెప్తోంది.మళ్లీ పేరు మారిస్తే తప్ప తెలంగాణలో ఓటర్లు బీఆర్ఎస్ ను నమ్మరని గట్టిగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచాయి. పదేళ్ల అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో తనదైన మార్క్ వేసుకుంది గులాబీ పార్టీ.ఉద్యమ పార్టీగా ప్రజలకు చేరువై రాష్ట్రాన్ని సాధించి ప్రజల మన్ననలు అందుకుంది.
తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా మారింది టీఆర్ఎస్. అయితే జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలన్న లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని వెల్లడించగా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడంతో పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ పేరుతో కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్టీని విస్తరించే కార్యాచరణను అమలు చేశారు.
అప్పట్లోనే పేరు మార్పుపై క్యాడర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రభావం అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలలో ప్రత్యక్షంగా కనిపించింది. అప్పటినుంచి పేరు మార్పుపై సతమతమవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు.ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ హరీష్ రావు ఖండువా మార్చి పెద్ద చర్చకు దారితీశారు.మరి తెలంగాణ ప్రజలు దీనిని ఎలా స్వాగతిస్తారో చూడాలి.