కేంద్రం పై మంత్రి కేటీఆర్ తన పోరును తీవ్రం చేశారు. గతం కన్నా వేగంగా తీవ్ర స్వరంతో కూడిన మాటలే ఆయన ఎక్కువగా వాడుతున్నారు. దీంతో బీజేపీ వర్గాలు కూడా వీటికి వెంట వెంటనే కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ బీజేపీలో ఈటెల, రఘునందన్, కిషన్ రెడ్డి, అరవింద్ ధర్మపురి, రాజాసింగ్ లాంటి లీడర్లే కీలకం. వీరిలో ఎందుకనో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎప్పుడో సైలెంట్ అయిపోయారు. అరవింద్ మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు కానీ కేటీఆర్ స్థాయి వాగ్ధాటి ఆయనకు అన్ని వేళలా ఉండడం లేదు.
కొన్ని సార్లు బూతులు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇవి అభ్యంతరకరం అని తెలిసినా కూడా మాట్లాడుతున్నారు. ఇక కిషన్ రెడ్డి లాంటి లీడర్లు కేంద్రంలో బిజీబిజీగా ఉండడంతో రాష్ట్ర పరిణామాలపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. ఈ విధంగా కానీ ఏ విధంగా కానీ తెలంగాణ బీజేపీ పోరు ఒకే ఒక్క వ్యక్తిపై చేస్తోంది. ఆయనే కేటీఆర్.
గతంలో కేటీఆర్ కన్నా కేసీఆర్ ను ఎక్కువగా ఫోకస్ చేసేవారు. కానీ ఇప్పుడు అందరి చూపుడువేళ్లు అన్నీ ఆయనవైపే చూపిస్తున్నాయి. ఇదే దశలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి కానీ ఇతర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి కానీ కేంద్రం అందిస్తున్న సాయం ఏంటన్నది కేటీఆర్ ప్రశ్న. పన్నుల రూపంలో అత్యధికంగా తాము కేంద్రానికి రూపాయలు చెల్లిస్తూ ఉంటే రాష్ట్రానికి మాత్రం విదిలింపులు చాలా అంటే చాలా అధమ స్థాయిలో లేదా తక్కువ స్థాయిలో లేదా చెప్పుకోదగ్గ రీతిలో లేవన్నది కేటీఆర్ ఆవేదన.
అదేవిధంగా సిలిండర్ ధర ఆ రోజు నాలుగు వందలు ఉంటే ఇవాళ 1050 రూపాయలు చేసి గృహావసరాలకు వాడే బండ ధర పెంచి మహిళల బాధలు పట్టకుండా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ నిన్నటి వేళ సిరిసిల్లలో మండిపడ్డారు. దేశంలో ఉన్నది సమర్థ నాయకత్వం కాదని మరో సారి చెబుతూ, తెలంగాణ ఉన్నతి కోసం తామేం చేశాం అన్నది మరోసారి వివరించేందుకు ప్రయత్నించారు.