ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు ఇంటి పట్టునే ఉంటున్నారు. లాక్డౌన్ రిలీఫ్ సమయంలో ఏదో మూడు గంటల పాటు నిత్యావసరాలకు వచ్చినా.. తర్వాత మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఎక్కువ సేపు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారు రాజకీయాలపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ తరఫున ఎన్నికైన కొత్తవారి గురించి చర్చించుకుంటున్నారు. తాజాగా కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ప్రధానంగా చర్చకు వస్తోంది.
వారు వ్యవహరించిన తీరుపై ప్రజలు జోరుగా చర్చ చేస్తున్నారు. వారే గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఇదే పార్టీకి చెందిన పశ్చిమ గోదావరిజిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అబయ్య చౌదరి. ఇద్దరూ వైసీపీ ఎమ్మె ల్యేలే అయినా..వారి వ్యవహారం మాత్రం రాజకీయంగా ఉత్తర-దక్షిణ దృవాలను తలపించే ఉందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. కరోనా ఎఫెక్ట్‌తో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రజల మధ్యకు వచ్చి వారికి ఏదో ఒక రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నిధులు ఖర్చు చేస్తున్నవారు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే శ్రీదేవి, అబ్బయ్య చౌదరిలు ఇద్దరూ కూడా ప్రజలమధ్యకు వచ్చారు. ఇద్దరు ప్రజలకు నిత్యావసరాలు పంచారు. అయితే, ఇద్దరికీ ప్రజల నుంచి ప్రశంసలు రావాలి కదా?! కానీ, ఒకరిని ప్రశంసించారు. మరొకరిని విమర్శించారు. దీనికికారణం ఏంటి? ఎవరు ప్రశంసలు పొందారు? ఎవరు విమర్శలకు గురయ్యారు? అనే విషయాన్ని చూస్తే.. ఉండవల్లి శ్రీదేవి శనివారం తన నియోజకవర్గంలో పారిశుద్ధ్య పనివారికి నిత్యావసరాలను పంచారు.
దాదాపు 100 మందికి ఆమె ఇచ్చారు. ఫొటోలు దిగారు. అయితే, దీనికి ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంతా ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చింది. ఇక, అబ్బయ్య చౌదరి స్థానికంగా ఉన్న పేదలకు కూరగాయలను పంచారు. దీనికిగాను ఆయన తన సొంత నిధులు ఖర్చు చేశారు. సుమారు 500 మందికి కూరగాయల సంచులు ఇచ్చారు. సో.. ఇదన్నమాట విషయం!