గ్రేటర్ నియోజకవర్గం శేరిలింగంపల్లిలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు..!

-

గ్రేటర్ హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఐటీ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం కూడా ఒకటి. అయితే ప్రతి సారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ జరిగే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతుంటాయి. మరి ఈ సారి ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో మ‌ళ్లీ సొంత పార్టీలో చేరిన మొవ్వా స‌త్య‌నారాయ‌ణ

నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు మొవ్వా సత్యానారాయణ సొంత గూటికి చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మొవ్వా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు మొవ్వాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉండి జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరి, కార్పొరేటర్లుగా ఎన్నికై ఇప్పుడు ఆ పార్టీ నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. తాము మారనున్న పార్టీలో టిక్కెట్టు రాకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ నాయకుల అభిమానులు చెబుతున్నారు.

మొవ్వా సత్యనారాయణ ఒకప్పుడు 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి భిక్షపతియాదవ్ చేతులలో కేవలం 1227 ఓట్ల తేడాతో మొవ్వా ఓడిపోయారు. అందుకు కారణం లేకపోలేదు. అప్పుడు లోక్‌సత్తా పార్టీ 30వేల ఓట్లను చీల్చడంతో టీడీపీ ఓడాల్సి వచ్చింది. అనంతరం 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందని మొవ్వా ఆశించారు. కానీ ఆయనకు భంగపాటు ఎదురైంది. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరారు.

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ (ఫైల్‌)

అయితే 2014లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అరెకపూడి గాంధీ అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో ఇప్పుడు గాంధీకే కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు. కాగా మొవ్వా టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ గానీ, నామినేటెడ్ పోస్టు గానీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. కానీ అది నెరవేరకపోవడంతోనే మనస్థాపం చెందిన మొవ్వా మళ్లీ సొంతగూటికే చేరారు. అయితే ఈ సారి మొవ్వాకు శేరిలింగంపల్లి టీడీపీ టిక్కెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్‌లు తమ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఎప్పటి నుంచో ఆశిస్తూ వస్తున్నారు. కానీ టిక్కెట్ వారికి రాకపోవడంతో.. వారు ఇప్పుడు తమ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తీవ్రంగా చర్చిస్తున్నారు. పార్టీ మారడమా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమా ఆనే అలోచనలో ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version