చంద్రబాబుకు చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ … నెలరోజులపాటు జైలుకు విరామం

-

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అక్టోబర్ 30న విచారణ జరిగింది. ఆ తర్వాత బెయిల్‌పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ఈరోజు కోర్టు తీర్పు వెలువరిస్తూ వైద్యపరమైన కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయవాది సునాకర కృష్ణమూర్తి తెలిపారు.

Chandrababu Naidu

నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్

కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుకు నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24న లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు షరతుల ప్రకారం చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆయన ఏ రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొనలేరు, ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేరు. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు. చంద్రబాబు తో ఇద్దరు డీఎస్పీలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్నారు న్యాయమూర్తి. జెడ్+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని సీబీఎన్ సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్యనించారు.

దాదాపు 50 రోజులుగా జైలుల్లోనే బాబు

కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉన్నారు. సెప్టెంబరు 9న సీఐడీ అతడిని అరెస్టు చేసింది. గతంలో విజయవాడ కోర్టును ఆశ్రయించినా అక్కడ నిరాశ చెందడంతో హైకోర్టును ఆశ్రయించారు. 52 రోజుల తర్వాత వైద్య కారణాలతో ఆయనకు ఈ బెయిల్ లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆయనను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలైంది. పై వాదనలు పూర్తి చేసిన అనంతరం కోర్టు ఈరోజు తీర్పును ప్రకటించింది. దీంతో 52 రోజుల రిమాండ్ తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచారు. టీడీపీ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలో భాగంగానే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు.

ఆరోగ్య పరిస్థితి బాలేదు

చంద్రబాబు దాదాపు 5 కిలోల బరువు తగ్గారని, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టుకు నివేదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రభుత్వ వైద్యులు పలు వైద్య పరీక్షలు చేయాలని సూచించారని వివరించారు. తక్షణమే కంటి ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ ఏడాది జూన్ లో ఎడమ కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేసినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో కుడికంటికి చేస్తామంటూ వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిందని… అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని కోర్టుకు నివేదించారు. దీంతో ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటే ఏమిటి?

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని భారీ పరిశ్రమల్లో పనిచేసేందుకు యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించాలని ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఓ ప్రైవేట్‌ కంపెనీకి టెండర్‌ వేశారు. ఈ పథకం కింద ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసి మొత్తం రూ.3300 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందులో ఒక్కో క్లస్టర్‌కు రూ.560 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యయంలో 10 శాతం వెచ్చించాల్సి వచ్చింది. అంటే మొత్తం రూ.370 కోట్లు. ఈ సొమ్మును షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ ఆరోపణల ఆధారంగానే ఆయనను అరెస్టు చేశారు. ఈ నిధుల దుర్వినియోగంలో మాజీ ముఖ్యమంత్రి హస్తం కూడా ఉందని చెప్పుకొచ్చారు. షెల్ కంపెనీలను సృష్టించి వాటికి నగదు బదిలీకి సంబంధించిన పత్రాలను కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version