ఏపీలో మళ్ళీ ప్రజలు జగన్ వైపే ఉన్నారా? ఈ సారి జగన్‌ని సీఎంగా చూడాలని ప్రజలు అనుకుంటున్నారా? అంటే వైసీపీ శ్రేణుల వర్షన్ చూస్తే అవునని, టిడిపి, జనసేన వర్షన్ చూస్తే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో ప్రజలు దాదాపు వైసీపీ, టీడీపీ అన్నట్లు విడిపోయారు. ఇంకా జనసేనకు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. ఏదో 5 శాతం వరకే న్యూట్రల్ ప్రజలు ఉంటారు. కాబట్టి ఎవరికి వారు ప్రజలు తమ వైపే ఉన్నారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో వైసీపీ అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చూస్తుంది. ఇప్పటికే జగన్..సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. వాటిపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. పథకాలు తీసుకున్న వారే తనని గెలిపిస్తారని అనుకుంటున్నారు. పైగా పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ తనని ఆదరిస్తారని భావిస్తున్నారు. అయితే వారంతా జగన్ వైపే ఉన్నారా? లేదా అన్న అంశంపై మెగా పీపుల్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జగనన్నే మా భవిష్యత్ పేరిట..జగన్‌కు మద్ధతు తెలుపుతూ మిస్సడ్ కాల్స్ ఇవ్వాలని ఇంటింటికి తిరిగి వాలంటీర్లు స్టిక్కర్లు అంటించి మరీ చెబుతున్నా విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రంలో దాదాపు కోటి 40 లక్షల కుటుంబాల్లో సర్వే చేస్తే..కోటి 17 లక్షల కుటుంబాలు మిస్సడ్ కాల్స్ ఇచ్చాయని వైసీపీ చెబుతుంది. ఇంకా ఆ రేంజ్ లో ప్రజా మద్ధతు వచ్చిందంటే జగన్ కు తిరుగుండదు. మళ్ళీ ఆయనే సిఎం అవుతారు. కానీ ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. కొందరు పథకాలు పోతాయని, వాలంటీర్లు చెప్పారని మిస్సడ్ కాల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఒక్కొక్కరికి రెండు, మూడు సిమ్‌లు కూడా ఉంటున్నాయి..రెండు ఫోన్లు కూడా ఉంటున్నాయి. ఇంకా అలా చూసుకుంటే మిస్సడ్ కాల్స్ విషయంలో చాలా లొసగులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన మిస్సడ్ కాల్స్‌ని చూసి అదే ప్రజా మద్ధతు అని వైసీపీ సంబరపడితే బోల్తా పడక తప్పదు.