ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల అధినాయకుల భజన విపరీతంగా పెరిగిపోతోంది. పోటీ పడి మరీ ఇటు తెలంగాణలో అటు ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీలో అయినా అధినాయకుడి మెప్పు పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం చాలా కామన్. అప్పుడే రాజకీయ భవిష్యత్ సాఫీగా సాగుతుంది. పదవులు కూడా సకాలంలో వస్తాయి. కానీ ఏపీలోని వైసీపీలో ఈ తరహా పనులు మరీ ఎక్కువగా అయిపోయాయి.
ఏకంగా మంత్రులు సైతం జగన్‌ను అసెంబ్లీ సాక్షిగా దేవుడు అంటూ కొలిచే స్థాయికి వెళ్లింది. అయితే ఇది మరింత ముదురుతోంది ఇప్పుడు. కారణం ఏంటంటే త్వరలోనే మంత్రుల మార్పు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భజన కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఎలాగైనా మంత్రి పదవి చేజిక్కించుకునేందుకు శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి ఏకంగా జగన్ కు గుడే కట్టేశారు. ఇప్పుడు ఇది రాజకీయాల్లో పెద్ద సంచలనమే రేపుతోంది.
ఈ గుడిని కూడా భరీ ఎత్తున దాదాపు రు. 3 కోట్లతో నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి పనులు జగన్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తాయని తెలుస్తోంది. ఇలా ఏకంగా ఓ మనిషిని దేవుడిని చేయడం అనేది ఎవరూ కూడా ఒప్పుకోరు. పైగా ఇలాంటివి చేస్తే చివరకు నవ్వులపాలు కావాల్సి వస్తుంది. ఒకవేళ అభిమానం అనేది ఉంటే అది ప్రజల్లో ఇమేజ్‌ను పెంచేలాగా చూపించాలి కానీ ఇలా దేవుడంటూ గుడులు కట్టేస్తే జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. జనాలకు ఏదో ఒక మంచి పని జగన్ పేరు మీద చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.