ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మేనిఫోస్టో లో ఇచ్చిన హామీలను నెరవెర్చే పనిలోనే నిమగ్నమయ్యారు. హామీలంటే పేపరు మీద రాయడం కాదు…మాటలు చెప్పడం కాదు..వాటిని అమలు చేసినప్పుడే నిజమైన నాయకుడు అవుతాడని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తండ్రి వైఎస్సార్ తరహా పాలన అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొన్నింటిపై సంతకాలు కూడా చేసేసారు. ఈ నేపథ్యంలో మద్యపాన నిషేధంపైనా పనులు ముమ్మరం చేసారు. గాంధీ జయంతి కల్లా జాతీయ రహదారుల వెంబడి.. దాబాలోనూ మధ్యం దుకాణాలు కనిపించడానికి వీల్లేదంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
పొరపాటున కనిపిస్తే ఆ బాధ్యత మీరే తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. కేవలం ఐదు నక్షత్రాల హోటళ్లకే మద్యం పరిమితమయ్యేలా చేస్తానని హామీ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ తర్వాత మద్యపానం బ్యాన్ చేసే ముఖ్యమంత్రిగా రికార్డు కు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ తమ కల నెరవేరిందంటూ హర్షం వ్యక్తం చేసారు. తమ స్వగ్రామంలో చిన్న పాటి రైతులు, కులీలు మద్యానికి బానిసలవ్వడంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నారు.
వాళ్ల బాధలు చూడలేక మద్యపాన నిషేధం కోసం తామెంతో కృషి చేసామని తెలిపారు. చిన్నపాటి మద్యం దుకాణు దారులకు కూరగాయల షాపులు, కిరాణా షాపులు పెట్టించి ఉఫాధి కల్పించినా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో కొందరు శత్రువులు తయారయ్యారని తెలిపారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి బెల్టు షాపులపై కొరడా ఝుళింపించడంతో తమ కల నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆరంభంలో కష్టంగా ఉన్నా భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు.