తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని సాధించాలని కాంగ్రెస్ బిజెపి ప్రయత్నాలు చేస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా తట్టుకొని నిలబడగలిగే అభ్యర్థుల కోసం కాంగ్రెస్, బిజెపి అన్వేషిస్తున్నారు. గతంలో కన్నా కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇప్పుడు తెలంగాణలో పట్టు సాధించాయి. తెలంగాణలో బిఆర్ఎస్ లో ఓడించడానికి రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ నియోజకవర్గాలలో గెలుపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని పవన్ తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జి నియమించామని, అభ్యర్థుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. బిజెపితో జనసేన పొత్తులో ఉన్నారు, ఇటు టీడీపీతో కూడా పొత్తు ప్రకటించారు. కానీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఎన్నికలనాటికి ఆ నిర్ణయం మారి బిజెపితో కలిసి ఎన్నికలకు వెళితే ఫలితాలు బిజెపికి అనుకూలంగా వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు టిడిపి కలిస్తే ఓట్లు ఇంకా ఎక్కువ చీల్చే ఛాన్స్ ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ప్రతి నియోజకవర్గంలోనూ పవన్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారనేది వాస్తవం. ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో పవన్ సఫలం అయితే చాలు గెలుపు వరిస్తుందని అని రాజకీయ వర్గాలు అంటున్నారు. అయితే జనసేన పోటీ చేస్తున్న 32 స్థానాలలో ఏ పార్టీ అభ్యర్థులకు ఓటమిని బహుమతిగా ఇవ్వనున్నారో, ఏ పార్టీకి నష్టాన్ని కలిగించనున్నారో వేచి చూడాల్సిందే