తెలంగాణ బిజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై..బిజేపి సస్పెండెడ్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, బిజేపి అధిష్టానంపై విమర్శలు చేశారని చెప్పి జిట్టాని బిజేపి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో కొందరు నేతలు ఈ మధ్య అధిష్టానంపై విమర్శలు చేశారని, కానీ వారిని వదిలేసి జిట్టానే ఎందుకు సస్పెండ్ చేశారని మీడియా ప్రశ్న వేస్తే..అది తమ పార్టీ అంతర్గత విషయమని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో జిట్టా మీడియా ముందుకొచ్చి కిషన్ రెడ్డి టార్గెట్ గా విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనని సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. అసలు ప్రతి అంశాన్ని మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ బీజేపీని బలహీనపరిచారని, అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.
తనను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందనరావు, ఈటల, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అటు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బలిపశువు చేశారని అన్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇలా బిఆర్‌ఎస్, కిషన్ రెడ్డి టార్గెట్ గా జిట్టా ఫైర్ అయ్యారు.
అయితే జిట్టా కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని తెలిసింది. అందుకే బిజేపిని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారని అర్ధమవుతుంది. కావాలని పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసుకున్నారని బిజేపి విమర్శలు చేస్తుంది.