తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడటం మొదలైంది..అసలు గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో ఎన్టీఆర్ పేరు వినబడుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా చంద్రబాబు పని అయిపోయిందని, లోకేష్ కు పార్టీని నడిపించే సత్తా లేదని, కాబట్టి టిడిపిని ఎన్టీఆర్‌కు అప్పగించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగులు ఎక్కడ జరిగితే అక్కడ ఎన్టీఆర్ అభిమానులు జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
గత ఎన్నికల నుంచి ఇదే పరిస్తితి..అయితే నిదానంగా చంద్రబాబు..పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు..అటు లోకేష్ సైతం నాయకుడుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు పాదయాత్రతో దూసుకెళుతున్నారు. అయితే పాదయాత్ర సమయంలో ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారని లోకేష్ కు యువత నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా లోకేష్..నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని అన్నారు. అయితే టిడిపి ఎన్టీఆర్‌ది అని..అంటే జూనియర్ ఎన్టీఆర్ తాతది అని కాబట్టి..ఆ పార్టీలోకి లోకేష్.. జూనియర్ని ఆహ్వానించేది ఏంటి అని కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు అంటున్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టిడిపిని ఎన్టీఆర్ కు అప్పగించాలని, అప్పుడైనా పార్టీ బ్రతుకుతుంది అని అంటున్నారు. ఇలా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర పీలేరులో జరుగుతుంది.అక్కడ ఎన్టీఆర్ అభిమానులు..అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ రావాలి అని ఫ్లెక్సీలు కట్టారు.
అంటే ఇంకా టిడిపిలో తారక్ పేరు వినబడుతూనే ఉంది..ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని,టిడిపి బాధ్యతలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు..కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసిన ఉపయోగం లేదనే చెప్పాలి.