వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలను లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దళిత సామాజికవర్గం నుంచి కీలక నేతలను తీసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొన్నటికిమొన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కొండేటి శ్రీధర్‌ను బీజేపీలోకి తీసుకుంది. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలోని మరో కీలక నేతతోపాటు ఆయన కూతురును కూడా పార్టీలోకి తీసుకునేందుకు కమలదళం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ ఆ తండ్రీ, కూతురు ఎవరని అనుకుంటున్నారా…? వారు మరెవరో కాదు.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీమరి, ఆయన కూతురు కడియం కావ్య కావడం గమనార్హం. నిజానికి.. చాలా కాలం కడియం శ్రీహరి దాదాపుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ డిప్యూటీ సీఎంల పదవులు లేకపోవడంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంగాకుండా.. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిపదవి పొందిన పాలకుర్తి ఎమ్మల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుదే పెత్తనం సాగడంపై కూడా కడియం అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తున్నారనే టాక్ బలంగా వినిపించింది. అయితే.. ప్రచారాన్ని కడియం తీవ్రంగా ఖండించారు. దీంతో కొద్దిరోజులు ఈ ప్రచారం ఆగిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా పలువురు దళితసామాజికవర్గానికి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్తుండడంతో మళ్లీ టాక్ మొదలైంది. కడియం బీజేపీలోకి వెళ్లడం ఖాయమమని, ఈ మేరకు కమలదళం కూడా భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి.. 2019 ఎన్నికల్లో కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ లేదా వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడట. కానీ.. ఈ రెండుచోట్లకూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రస్తుతం కావ్య కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాలతో జనంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదట కావ్య బీజేపీలోకి వెళ్తుందని, ఆ తర్వాత కడియం కూడా వెళ్తారంటూ రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దళిత సామాజికవర్గం నుంచి మహిళా నాయకత్వం లేదని, కడియంతోపాటు కావ్యను పార్టీలోకి తీసుకుంటే.. బలోపేతం కావొచ్చునని కమలం నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కావ్య బీజేపీలోకి వెళ్తే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!