కరీంనగర్ ఈ నియోజకవర్గం గెలుపును మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలో ఒకప్పుడు వెలమ ఇలాఖా గా ఉండేది. ఇప్పుడు మున్నూరు కాపులు పాగా వేసారని చెప్పవచ్చు. అందుకే మూడు పార్టీలు మున్నూరు కాపులని తమ అభ్యర్థులుగా ప్రకటించారు.
బిఆర్ఎస్ నుండి మూడుసార్లు గెలిచిన గంగుల కమలాకర్ ఈసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పొందిన బండి సంజయ్ ఈసారి గెలిచి చూపాలని వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున బొమ్మకల్ సర్పంచ్ కురుమళ్ళ శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు మున్నూరు కాపులే కావడంతో ఈసారి ఎవరు గెలుస్తారో అనే అంశం ఆసక్తికరంగా మారింది.
మున్నూరు కాపు, ముస్లిం ఓట్లే కరీంనగర్ లో గెలుపుని నిర్ణయిస్తాయి. కరీంనగర్ లో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధితో గంగుల ప్రచారం చేస్తుంటే, బండి సంజయ్ ఆ అభివృద్ధి కేంద్రంలోని బిజెపి నిధులతో చేశారని కౌంటర్ ఇస్తున్నారు. బండి ఎంపీగా గెలిస్తేనే కరీంనగర్ ను పట్టించుకోలేదని, ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక చెప్పక్కర్లేదని గంగుల విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఉన్న కేసులే అతనికి మైనస్ గా నిలిచాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లపైనే శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారు. రెండుసార్లు ఓటమి పొందిన బండి సంజయ్ సానుభూతి ఉంది. గంగుల కమలాకర్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కలిసి ఈసారి సంజయ్ గెలుపును సునాయాసం చేస్తాయని రాజకీయ వర్గాలు అంచనా ఇస్తున్నాయి.
మరి కరీంనగర్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే!