ఓ వైపు బరిలో ముఖ్యమంత్రి,మరోవైపు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి…ఈ ఇద్దరినీ ఓ సామాన్యుడు మట్టికరిపించాడు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలిచిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి సంచలన విజయం సాధించారు. ఏకంగా 5,156 ఓట్లా మెజారిటీ తెచ్చుకున్నారు వెంకట రమణారెడ్డి. ఇద్దరు కీలక నేతలను ఓడించి తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేకతను చాటుకున్నారు బీజేపీ నేత.
పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు కేసీఆర్. వ్యూహాత్మకంగా ఆయన ఈసారి కామారెడ్డితో పాటు గజ్వెల్ నుంచి కూడా పోటీ చేశారు.ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీకి దిగారు. సీఎం కేసీఆర్ ని ఓడించాలన్నది రేవంత్ రెడ్డి పట్టుదల.అందుకే ఇక్కడి నుంచి పోటీకి దిగారు. ఇలా ఇరువురు హామాహేమీలు రెండేసి నియోజకవర్గాల్లో బరిలోకి దిగారు.బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీనుంచి పోటీ చేసిన వారితో పాటు మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నవంబరు 30న ఇక్కడ పోలింగ్ జరిగింది.71 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో జరిగిన కౌంటింగ్లో చివరికి వచ్చేసరికి విజయం వెంకట రమణారెడ్డి ని వరించింది.
కామారెడ్డి అసెంబ్లీ సీటు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లో అభ్యర్థులను విజయం దోబుచూలాడింది. తొలి రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజలో నిలిచారు. ఓట్ల లెక్కింపు చివరి అంకానికి చేరుకునేసరికి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. అయితే అనుహ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చివరి రౌండ్లలో పుంజుకొని లీడ్ లోకి దూసుకొచ్చారు. రెండో రౌండ్ నుంచి లీడింగ్లో ఉన్న రేవంత్ రెడ్డి చివరి రౌండ్లలో వెనుకబడ్డారు. ఈ ఇద్దరినీ కాదని చివరికి వెంకట రమణారెడ్డినే విజయం వరించింది. ఈ గెలుపుతో ఒక్కసారిగా వెంకట రమణారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు.
కామారెడ్డిలో కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన వెంకటరమణ రెడ్డికి 50,294 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ కు 46,780 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 45,419 ఓట్లతో రేవంత్ రెడ్డి మూడోస్థానానికి చేరుకున్నారు.
వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీ సాధించారు. తన వినయంతో అటు కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డికి కూడ వెంకటరమణ రెడ్డి షాకిచ్చారు. తెలంగాణసీఎంను…సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఒకేసారి ఓడించి రికార్డు సృష్టించారు.
కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయానికి ప్రధాన కారణం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు అనే చెప్పుకోవాలి.ఈ విషయంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేపట్టగా వెంకటరమణ రెడ్డి సారథ్యం వహించారు.గతంలో జిల్లా పరిషత్ చైర్మెన్ గా పనిచేసిన వెంకట రమణారెడ్డి కి అన్ని గ్రామాలపై పట్టుంది.కామారెడ్డి కి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసిన బీజేపీ అభ్యర్థి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.అంతేకాదు కేసీఆర్, రేవంత్ రెడ్డి లను స్థానికేతరులని ఆయన చేసిన ప్రచారం కూడా ప్రజలకు చేరువైంది. అంతేకాదు తనను గెలిపిస్తే నియోజకవర్గంలో చేయనున్న కార్యక్రమాలపై నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడ విడుదల చేశారు. మరో వైపు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,రేవంత్ రెడ్డిలు స్థానికేతరులని వెంకటరమణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని పదే పదే చెప్పారు.దీంతో ఓటర్ల ఉశ్వాసాన్ని చూరగొన్నారు వెంకట రమణారెడ్డి.