త్వరలోనే తెలంగాణకు సీఎం, సూపర్‌ సీఎం..?

-

తెలంగాణా ముఖ్యమంత్రిగా మంత్రి కేటిఆర్ బాధ్యతలు చేపడతారు అనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. తెలంగాణా ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రచారం ఎక్కువగానే జరిగింది. కేసీఆర్‌ రాజకీయంగా ఇక తప్పుకునే అవకాశం ఉందని కొందరు… లేదు కేంద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని మరికొందరు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ వచ్చారు. అసలు కేసీఆర్‌ ఆలోచన ఏంటి అనేది బయటకు రాకముందే… కేటిఆర్ ని ముఖ్యమంత్రిగా సీనియర్లు అంగీకరించడం లేదు,

హరీష్ రావు వేరు కుంపటి పెట్టారు, కేకే కస్సుమన్నారు అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఎక్కువగానే జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యూహం విఫలం కావడంతో ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ మరో ఆలోచనలో ఉన్నారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన తెలంగాణా ముఖ్యమంత్రిగా తప్పుకుని కేటిఆర్ కి ఆ బాధ్యతలు అప్పగిస్తారని తాజాగా జాతీయ మీడియాలో ఒక కథనం వచ్చింది.. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి కేటిఆర్ ని కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన తర్వాత… నేరుగా ప్రభుత్వంలోకి తీసుకోలేదు… దీనికి కారణం సీనియర్లతో ఆయన మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు అనే భావనతో కేసీఆర్‌ ఆ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఒక అడుగు ముందుకి వేసి… యుపియే హయాంలో జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేసినట్టు… తెలంగాణా స్టేట్ అడ్వైజరీ కమిటి ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో చైర్మన్ గా కేసీఆర్‌ ఉండి… పాలనలో తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతూ కేటిఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాది మే తర్వాత ఇది జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version