సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వైసీపీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ వర్గాలు. జనవరి 20వ తేదీన ఆమె తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.20వ తేదీన మొగల్తూరులో దివంగత కృష్ణంరాజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా హెల్త్‌క్యాంప్‌ను ప్లాన్ చేశారు. విదేశాల నుంచి ప్రముఖ వైద్యులను రప్పించి అరుదైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆమె ఇదివరకే ప్రకటించారు. కృష్ణంరాజు పేదలకు విద్య, వైద్యం అందించాలని చెప్పేవారని వారు ఈ ప్రకటనలో గుర్తుచేసుకున్నారు.
వైసీపీ నుంచి శ్యామలాదేవికి టిక్కెట్ ఆఫర్ వచ్చినట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.ఆమెకు నర్సాపురం లోక్‌సభ టిక్కెట్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో క్షత్రియులకు బలమైన ఓటుబ్యాంక్ ఉంది. ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే.2019లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఆ తరువాత వివిధ కారణాల దృష్ట్యా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడు ఆయన టీడీపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు పోటీగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలా దేవికి నర్సాపురం లోక్‌సభ టికెట్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత నేత కృష్ణంరాజు ఇదే నర్సాపురం నుంచి గతంలో లోక్‌సభకు ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు.అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణశాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
రాజకీయాలపై కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో ఆమె కనిపించారు. అలాగే ఎన్నికల ప్రచారంలోనూ ఆయనకు సాయపడ్డారు. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి,తన భర్త కృష్ణంరాజు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలా దేవి వైసీపీ చేసిన ఆఫర్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
అయితే ఒక మంచిరోజు చూసుకుని తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆమె వైసీపీ ఆఫర్‌ను అంగీకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉండబట్టే భారీగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం లోక్సభ అభ్యర్థిని వైసీపీ ఇంకా ఫైనల్ చేయని నేపథ్యంలో శ్యామలాదేవి ప్రకటనను బట్టి ఆమె పేరు ప్రకటించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. శ్యామలాదేవి నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.