ఇటీవల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటిఆర్‌ని సిఎంని చేయాలని చెప్పి కేసిఆర్….నిదానంగా హరీష్ రావుని సైడ్ చేస్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రచారానికి తగ్గట్టుగానే కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి. సరే వాటిని వదిలేస్తే….ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో హరీష్ రావు బకరా అవుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంటే కేసిఆర్ ఉపఎన్నికల గెలుపు బాధ్యత హరీష్‌పై వేశారు. అందుకే హరీష్ కాలుకు బలపం కట్టుకుని మరీ హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు. మొత్తం బాధ్యతలు తానే చూసుకుంటున్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ గెలిస్తే పర్లేదు…అప్పుడు ఆ క్రెడిట్ హరీష్‌కే కాకుండా అందరూ తీసుకుంటారు. కేసిఆర్ పాలనని మెచ్చి ఓట్లు వేశారని చెప్పుకుంటారు.
ఒకవేళ ఉపఎన్నికలో ఓడిపోతే బలయ్యేది హరీష్ అని అర్ధమవుతుంది. ఓటమి భారమంతా హరీష్ మోయాల్సి ఉంటుంది. ఓటమికి కారణం హరీష్ అని చేతులు దులుపేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మంత్రి కేటిఆర్‌ని కేసిఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎక్కువ జోక్యం చేసుకునివ్వడం లేదు. కేసిఆర్ సైతం తెరవెనుక ఉండి కథ నడుపుతున్నారు గానీ, డైరక్ట్‌గా రంగంలోకి దిగడం లేదు. అసలు కేటిఆర్ అయితే హుజూరాబాద్ మొహం చూడటం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం తమకు ఏమంత పెద్ద విషయం కాదని, తాము ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించామని మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నికని కేటిఆర్ లైట్ తీసుకున్నారు.
పైగా ఉపఎన్నిక ప్రచారంలో కూడా కేటిఆర్ పాల్గొవడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ వచ్చిన ఒకరోజుకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. తెలివిగా పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ముఖ్యమని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ క్లియర్ కట్‌గా సీన్ అర్ధమవుతుంది….హుజూరాబాద్ అంశంలో కేటిఆర్ ఎస్కేప్ అవుతున్నారు..హరీష్ ఇరుక్కుపోనున్నారు.