ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గం.. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవా నడుస్తూ వచ్చింది. మధ్య మధ్యలో టిడిపి..కాంగ్రెస్‌కు చెక్ పెడుతూ వచ్చింది. 1994, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి విజయం సాధించింది. అయితే 2018 ఎన్నికల్లో తొలిసారి బిఆర్‌ఎస్ జెండా ఎగిరింది. అయితే మక్తల్ నియోజకవర్గం అనేది చిట్టెం ఫ్యామిలీ కంచుకోట.
గతంలో చిట్టెం నర్సిరెడ్డి మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఇక నర్సిరెడ్డి కుమార్తె డికే అరుణ, కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. డికే అరుణ…డికే ఫ్యామిలీ నుంచి గద్వాల్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఆమె కాంగ్రెస్ లో అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బిజేపిలో ఉన్నారు. ఇటు చిట్టెం రామ్మోహన్ రెడ్డి సైతం..2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మాత్రం విజయం సాధించారు. కానీ తర్వాత ఆయన బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇక ఎమ్మెల్యేగా ఆయన బాగానే పని చేస్తున్నారు. వ్యతిరేకత కూడా పెద్దగా లేదు. ఇప్పటికీ అక్కడ చిట్టెంకు లీడ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన నేత కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి సీటు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఇటీవలే దయాకర్ కన్నుమూశారు. చనిపోయే వరకు టిడిపిలోనే ఉన్నారు. అయితే తెలంగాణలో టిడిపి పని అయిపోయింది. దీంతో దయాకర్ ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు చూస్తుంది. ఈ క్రమంలోనే దయాకర్ భార్యని మక్తల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది.