ఏపీ ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో బహిరంగ సభా ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛైన రైల్వే జోన్కు ప్రధాని రేపు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కేవలం ఈ 6 నెలల్లోనే రూ.6 వేల కోట్ల విలువైన హైవేలు సహా పలు అభివృద్ధి పనులను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందన్నారు.
రేపు ప్రధాని శంకుస్థాన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. టీడీపీ ఎన్డీయేలో భాగమైనందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. తొలి విడతగా రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు చేయబోయే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో త్వరలో విద్యుత్ చార్జీలు భారీగా తగ్గతాయని వివరించారు. గత వైసీసీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను దెబ్బతీశారని ఫలితంగా కరెంట్ చార్జీల భారం ప్రజలపై పడిందని తెలిపారు.