ఎప్పుడైతే ఈటల భూ కబ్జా ఆరోపణలు తెరమీదకు వచ్చాయో.. వెంటనే దేవరయంజాల్ భూములను కూడా కబ్జా చేశారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి ఏడెకరాలు కబ్జా చేశారని, అందులో ఫామ్ హౌస్‌కూడా కట్టుకున్నారని ఆరోపించారు. అలాగే మంత్రి కాలేజీలను కూడా కొన్ని చెరువులకు సరిపడా జాగ విడిచిపెట్టకుండా కట్టారంటూ ఆరోపించారు.
అంతే కాకుండా ఓ టీవీ డిబేట్ లైవ్ లో పాల్గొని ఆధారాలను కూడా చూపించారు. అయితే ఇదే లైవ్ డిబేట్ లోకి మంత్రి మల్లారెడ్డి కూడా ఫోన్ కాల్ ద్వారా వచ్చి.. రేవంత్ పై విరుచుకుపడ్డారు. తాను ఒక్క ఎకరం కూడా కబ్జా చేయలేదని, ఆ ఫామ్‌హౌస తన బావమరిదిది అని చెప్పారు. రేవంత్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.
ఇక ఇదే సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానంటూ రేవంత్ చెప్పారు. ఈ విషయంపై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని తేల్చి చెప్పారు. ఇక ఈ డిబేట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో మంత్రిగారిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. మరి ఇరువరి సవాళ్లు ఎంత వరకు వెళ్తాయో చూడాలి. ఇక ఇదే భూములలో ఈటల కూడా 30ఎకరాల వరకు కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో.. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం కేసీఆర్ విచారణ కమిటీ వేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి నివేదిక రాకపోవడం ఇక్కడ ట్విస్టు. చూడాలి మరి ఎలాంటి నివేదిక వస్తుందో.