శ్రీరామానుజాచార్యుల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కేసీఆర్ అంటున్నారు. అటువంటి క్రియాశీలత ఉంటే చాలు కానీ ఉంటుందా? పేదరికం సంపన్న వర్గం సర్వం సమానం అని చెప్పగలమా? అయినా కాలం గెలుపులో మనుషులు ఏ విధంగా తమను తాము చూసుకుంటారో అదే గొప్ప సందర్భం.ఈ సారి కేసీఆర్ కొన్ని మాటలు చెప్పారు. ఆశ్రమం కారణంగా పర్యాటకమే కాదు ఆధ్యాత్మికం కూడా బాగుంటుందని! ఆధ్యాత్మికం కారణంగా మనిషి బాగుంటున్నాడు కానీ ఆచరణ శూన్యతలో చెడిపోతున్నాడు.
భక్తి అనే పారవశ్యం పొందడంలోనే ఆనందం ఉంది. కనుక భక్తి అనే పారవశ్యం మనుషుల్లో ఉన్నంత వరకూ బాగా ఉంటుంది.. అది కొన్ని క్షణాల పాటు నీ ధర్మాన్నో నీ తత్వాన్నో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ క్షణాలు దాటాక మళ్లీ గండాలు తప్పవు. మన దగ్గర, మనలో ఉన్నవి అన్నీ మళ్లీ వెలుగులోకి రాక తప్పవు. మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఓ పెద్ద మాట ఎప్పటికీ అమలు కాదు అన్నది ఇప్పటిదాకా ఉన్న నిరూపణ.. ఆధ్యాత్మిక స్రవంతి ఇచ్చే ఓ గొప్ప సాంత్వన మాత్రమే ఆ ఆలయ ప్రాంగణం లేదా ఆ ఆశ్రమ ధర్మం.. అన్నింటినీ విడిచి పోవడం తప్పు.
అన్నింటినీ ఉంచుకుని అవసరం మేరకు వాడుకోవడమే మనిషి పాటించాల్సిన లక్షణం..అటువంటి సహన మూర్తులు ఎందరుంటే అంత బాగుంటుంది ఈ లోకం.. స్ఫూర్తి అనే పదం దగ్గర ఆగిపోయి ఆలోచిస్తే తేలేవెన్నో తేలనివి ఎన్నో!
నిన్నటి వేళ చినజియరు స్వామి ఆశ్రమానికి కేసీఆర్ వెళ్లారు. వెళ్లాక వెళ్లక ముందు కూడా చాలా మాటలు చెప్పారు. అవన్నీ అమలుకు అందివేనా? మనుషులలో ఇప్పటికిప్పుడు ఏ మార్పూ ఆశించలేం కానీ కొన్ని మాత్రం చాలా గొప్ప వివరాలు అందించి వెళ్తాయి. ఆ విధంగా విశిష్ట శక్తి ఏదో నడిపిస్తున్నదన్న భావననో, అభిప్రాయాన్నో మనలో ఉంచుకుని చేసే ప్రయాణమే గొప్పది.
గొప్ప విప్లవానికి కారణం విశిష్టాద్వైతం. మనుషుల్లో దేవుడు దేవుడిలో మనిషి ఇంకా ఆ రెండు ఒక్కటే .. అవును! దేవుడు మనిషి సర్వం సమానం అని చెప్పేంత శక్తి మనలో ఉందా? చెప్పగలిగినంత, వినగలిగినంత వరకూ ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇప్పుడు ముచ్చింతల్ లో జరుగుతున్న 12 రోజుల యజ్ఞం ఏం చెప్పబోతుంది..విశిష్ట తత్వం ఇప్పటి నుంచి అయినా పాటింపులో ఉంటుందా?
మనుషుల్లో సమానత్వం అన్న పెద్ద పదం ఒకటి కోరుకుంటున్నారు కేసీఆర్. విని నవ్వుకోవడం మినహా మనం ఏం చేయగలం సర్..మనం ఏం చెప్పినా మనుషులు వింటారా మనం ఏం చెప్పినా పాటిస్తారా? అయినా కేసీఆర్ ఆ రామానుజాచార్యుల విగ్రహం దగ్గర చాలా మాటలు చెబుతున్నారు. వాటిని విని ఊరుకోవడం మినహా మనుషుల్లో ఉండే అసహాయతలు ఇంత వేగంగా తొలగిపోవు. అసమానతలకు కొలమానంగా నిలిచే సామాజిక ప్రవర్తన నుంచి విడిపోలేం. కనుక కేసీఆర్ సర్ ఆశ్రమం నుంచి ఎన్ని మాటలు అయినా చెప్పవచ్చు. ఆ విగ్రహం చూసి పొంగిపోవడం మంచిదే! కానీ సమానత్వం అన్న భావన దగ్గర ఎన్నోఏళ్లుగా కేసీఆర్ అనే కాదు అందరు పాలకులూ ఓడిపోతున్నారు.