ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున టీడీపీ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఎన్టీఆర్ పేరుని తీసి..వైఎస్సార్ యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అసలు ఈ యూనివర్శిటీతో వైఎస్సార్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్సార్ డాక్టర్ అని..అందుకే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టమని చెబుతున్నారు.
దీనిపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున..వైసీపీపై ఫైర్ అవుతున్నారు. ఇది పిచ్చి చర్య అని ఫైర్ అవుతున్నారు. అలాగే దీనిపై చంద్రబాబు..గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ అంశంపై ఎన్టీఆర్ ఫ్యామిలీ స్పందించాలని టీడీపీ శ్రేణులు కోరుకున్నారు. ఇదే క్రమంలో నందమూరి రామకృష్ణ, కల్యాణ్ రామ్‌లు పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేయడం బాధ కలిగించిందని మాట్లాడారు.
అయితే టర్కీలో సినిమా షూటింగులో బిజీగా ఉన్న బాలయ్య దీనిపై స్పందించలేదు. ఇక ఈ అంశంపై ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ..పేరు మార్చినంత మాత్రాన..తెలుగు ప్రజల గుండెల్లో నుంచి ఎన్టీఆర్‌ని చెరిపివేయలేరని చెప్పుకొచ్చారు. అంటే పేరు మార్చడాన్ని తప్పు పట్టలేదు. అలా అని వైసీపీని విమర్శించలేదు. దీంతో తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ పైనే రివర్స్ అవుతున్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేది అని మాట్లాడుతున్నారు. అయినా తమకు ఎన్టీఆర్ అక్కర్లేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య..వైసీపీపై విరుచుకుపడ్డారు. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..” అంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ పంచ్ లతో విరుచుకుపడ్డారు.
ఇక బాలయ్య పంచ్‌లకు తెలుగు తమ్ముళ్ళు.. అది బాలయ్య అంటే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఎన్టీఆర్ పోస్టుతో టీడీపీ శ్రేణులు నిరాశపడితే…బాలయ్య పోస్టుతో తమ్ముళ్ళలో జోష్ పెరిగింది.