టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. మొన్నటి వరకు అత్యవసరం అయితే తప్ప , ఏపీలో అడుగు పెట్టేందుకు ఇష్టపడలేదు. ఇక్కడకు వచ్చినా సర్వం జూమ్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో, కాస్త ఆందోళనలో ఉన్న బాబు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే , ఈ సమయంలో ఆక్టివ్ గా ఉండాల్సిన ఆయన తనయుడు, రాజకీయ వారసుడు లోకేష్ సైతం ఇప్పుడు యాక్టివ్ గా కనిపించకపోవడం, ఆయన సైతం హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వంటి వ్యవహారాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఒకపక్క ఏపీ లోని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల హడావుడి జరుగుతోంది. ఇక్కడ అన్ని పార్టీలు గెలిచేందుకు అస్త్రశస్త్రాలను ఉపయోగించే పనిలో ఉన్నాయి. ఈ సమయంలో పార్టీ నాయకులలో హుషారు తీసుకువచ్చి, వారిని ముందుకు నడిపించాల్సిన లోకేష్ సైతం ఇప్పుడు అజ్ఞాతవాసం గడుపుతుండటం పై తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారట. ఏపీ లోనే కాకుండా, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సమయంలో అటు ఏపీ లో యాక్టివ్ గా ఉండకుండా, అలాగే తెలంగాణలోనూ యాక్టివ్ గా ఉండకుండా, లోకేష్ సైలెంట్ కావడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక నిత్యం ప్రజల్లోనే ఉంటానని, టిడిపి మళ్లీ అధికారం చేపట్టే వరకు విశ్రాంతి తీసుకోను అని కొద్ది రోజుల క్రితం ఏపీ లోని జిల్లాల పర్యటనలో లోకేష్ హడావుడి చేశారు.
చంద్రబాబు వయసు రీత్యా యాక్టివ్ గా ఉండే అవకాశం లేకపోవడంతో, లోకేష్ ఒక దారిలో పడ్డారని, పార్టీని గాడిలో పెడతారని అంతా భావించారు. అయితే రెండు మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేసి హడావుడి చేసిన ఆయన ఆ తర్వాత ఏపీ కి దూరంగా ఉండడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో వివిధ కమిటీల పేరుతో పదవులు ఇచ్చినా, నాయకులలో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదని, ఈ సమయంలో అటు బాబు కానీ, ఇటు లోకేష్ కానీ , పార్టీ ని పట్టించుకోకుండా, వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు లేవనెత్తిన ప్రశ్నలకు టిడిపిలో సమాధానం కరువైందట.
– Surya