రాష్ట్రంలో అనూహ్య రాజకీయం తెరమీదికి వచ్చింది. ఎప్పుడూ లేంది.. ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు నోటి నుంచి దివంగత సీఎం, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి జపం మొదలైంది. ఆయనే నయం- అని సాక్షాత్తూ చంద్రబాబు తన మనసులోని మాటను బయటకు చెప్పడంపై ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఏనాడూ.. నువ్వు మంచివాడివి బాసూ! అని బాబు ఒక్కమాట కూడా అనలేక పోయారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనపై అవాకులు-చెవాకులు పేలారు.
అంతేకాదు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్న సమయంలోనూ గతంలో మీ తండ్రి చేసిన పనే మేం చేస్తున్నాం.. అంటూ బాబు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అలాంటి బాబు ఒక్కసారిగా వైఎస్‌ను కీర్తించడం ప్రారంభించారు. మీడియా స్వేచ్చకు సంబంధించి వైఎస్ తన హయాంలో తీసుకురావాలని భావించిన జీవోను అప్పట్లో తాము వ్యతిరేకించడం వల్లే వెనక్కి తీసుకున్నారని, కానీ, ఇప్పుడు జగన్ మాత్రం దీనికి మరిన్ని కోరలు తొడిగి మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..
వైఎస్ నయం జగన్ కంటే అంటూ సరికొత్త వ్యాఖ్యలు, ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. వీటిని పరిశీలిస్తున్న విశ్లేషకులు .. నిజంగానే జగన్ అంతగా బాబును ఇబ్బంది పెడుతున్నారా? అనే విషయంపై చర్చిస్తున్నారు.వాస్తవానికి మీడియా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వాలను బద్నాం చేయడం అనే విషయంపై కేంద్రంలో నూ కొన్ని నాళ్ల కిందట విస్తృతంగానే చర్చ జరిగింది. తమకు నచ్చిన పాలకులను అందలం ఎక్కించే విషయంలో కొన్ని మీడియా వర్గాలు అనుకూలంగా వ్యవహరించడం కొత్తకాకపోయినా.. రాను రాను అదేప నిగా పెట్టుకుని,ప్రజా పక్షం కంటే కూడా రాజకీయ పక్షాలుగా నే మీడియాలు మారిపోయాయి.
ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు మీడియాలో కి ప్రవేశించడంతో ఈ పరిస్తితి మరింత పెరిగింది. దీనికి చంద్రబాబు కారణమనేది ఓ విమర్శ కూడా ఉంది. అలాంటి బాబుకు ఇప్పుడు జగన్ ఏదో కొంపలు మునిగిపోయే పనిచేశారని, ఆయనకన్నా.. ఆయన తండ్రి బెటరని చెప్పడం .. హాస్యాస్పదంకాదా! అనేది విశ్లేషకుల మాట.