టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నాడు. అసెంబ్లీ ముట్టడి రోజు గల్లాను పోలీసులు అరెస్ట్ చేసి, గుంటూరు సబ్ జైలుకు తరలించగా, అదే రోజు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై దౌర్జన్యానికి ప్రేరేపించారని గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరు హెడ్ కానిస్టేబుల్ పెరంబదూరి వేణుగోపాలస్వామి ఫిర్యాదు చేశాడు. తమను నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని, అందుకే అవే సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 31గా రెండో కేసును పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపారు.
ఆందోళనకారులు గుంపుగా వచ్చి సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, వారిని వెనక్కు పంపేందుకు తాము ప్రయత్నిస్తుండగా, వీళ్లను రాళ్లతో కొట్టాలంటూ, కొందరు రాళ్లు విసిరారని, వాటిల్లో ఒకటి తన కుడి కంటి పైభాగంలో తగిలిందని ఏఆర్ కానిస్టేబుల్ గజ్జల హరీశ్ ఫిర్యాదు చేశారు. అలాగే మరి కొందరు పోలీసులకు ఇతర చోట్ల గాయాలు అయ్యాయని, ఇక్కడి తీవ్రతను గమనించిన ఫోర్స్, తమను రక్షించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆపై తాము విచారించగా, గల్లా జయదేవ్ తో పాటు మరికొందరు దాడి చేసినట్టు వెల్లడైందని అన్నారు. ఈ నేపథ్యంలోనే జయదేవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.