జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ? ఎవరికీ అర్థం కావడం లేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ రోజుకో చేత… పూటకో మాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. జనసేన పార్టీని ఓ పెద్ద పార్టీ తమ పార్టీలో కలిపేయాలని తనపై ఒత్తిడి చేస్తోందని వెల్లడించారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జనసేనను మాత్రం తాను ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని చెప్పటం విశేషం. జనసేన పార్టీని జాతీయ సమగ్రత కాపాడడం కోసం… విలువల కోసం తాను స్థాపించానని… అలాంటి పార్టీని తాను ఏ పార్టీలోనూ కలపనని స్పష్టం చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక రాజోలులో మాత్రమే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఓటమి తర్వాత రెండు నెలలకు పైగా గ్యాప్ తీసుకుని పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో శుక్రవారం సమావేశం అయిన పవన్ ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
తాను ఎప్పుడూ సత్యం కోసమే పని చేస్తానని… పార్టీ గురించి గానీ…. లేదా ఎవరికి ఎలాంటి అభిప్రాయం తనకు చెప్పాలని పవన్ జనసేన కార్యకర్తలకు సూచించారు. అలా కాకుండా సోషల్ మీడియాలో చెప్పేసి సరిపెట్టేస్తే వినడానికి ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పారు. ఈ క్రమంలోనే తన బలం తనకు తెలుసని… తన బలహీనత కూడా తనకు తెలుసని పేర్కొన్నారు.
ఈ సందర్భంగానే జనసేన కార్యకర్తలు అంతా వరద బాధితులకు సాయం చేయాలని పవన్ పిలుపు ఇచ్చారు. తనకు అభిమానులతో ఫొటోలు దిగడానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే అందరూ ఒకేసారి వస్తేనే తనకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ఏదేమైనా పవన్ పార్టీ విలీనంపై చేసిన ప్రకటనతో జనసేన వర్గాలు అయోమయంలో పడ్డాయి. పవన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పడాన్ని బట్టి చూస్తే వచ్చే ఐదేళ్లు పార్టీని ముందుకు నడిపిస్తాడా ? లేదా ? అన్న ప్రజారాజ్యంలా విలీనం చేస్తాడా ? అన్న సందేహాలు చాలా మందికే కలుగుతున్నాయ్.