టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతల్లో ఒకరు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తమ్ముడిగా ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో పేరుంది. అయితే, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా అనివార్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అయితే, నియోజకవర్గంలో ఎలాగైనా మళ్లీ గులాబీ జెండా ఎగురవేసి ఈటలను ఓడించాలని సీఎం కేసీఆర్ సర్వశక్తులను ఒడ్డుతున్నారు.
స్వయంగా ఆయనే హుజురాబాద్‌కు వచ్చి ‘దళిత బంధు’ స్కీమ్‌ను ప్రారంభించి టీఆర్ఎస్ వైపు ఉండాలని జనాన్ని కోరారు. అయితే, ఈటల ఎఫెక్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. గులాబీ పార్టీ ప్రారంభం నుంచి ఈటల ఉన్నందున ఆయన అనుచరగణం పింక్ పార్టీలో ఉందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆయన సపోర్ట్‌తో కొందరికి ఎమ్మెల్యే టికెట్స్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, వీరందరూ ఈటల రాజేందర్‌కు కోవర్టులుగా ఉన్నారన్న అనుమానంతో సీఎం కేసీఆర్ వారిపైన దృష్టిపెట్టినట్లు సమాచారం.
ఈ జాబితాలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరి కొందరు టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరినీ పార్టీ లైన్ దాటితే వేటు పడుతుందని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తంగా కేసీఆర్ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా హుజురాబాద్ బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడో లేదో చూడాలి మరి.. అయితే, సీఎం పర్యటనతో హుజురాబాద్‌లో పింక్ పార్టీ ప్రచారంలో ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉంది.