నేతాజీ చుట్టూ బెంగాల్ రాజకీయం

-

బెంగాల్ ఎన్నికలు రాగానే.. అన్ని పార్టీలకూ నేతాజీపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నేతాజీ జయంతిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరాక్రమ్ దివస్ గా ప్రకటించింది. బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కారు.. దేశ్ నాయక్ దివస్ గా నిర్వహించింది. ఓట్ల కోసం నేతాజీని ఓన్ చేసుకునే ప్రయత్నంలో.. ఆయన ఆశయాలకు మాత్రం తిలోదకాలిస్తున్నాయి.

సుభాష్ చంద్రబోస్ దేశం గర్వించే నాయకుడు. జయంతే కాని వర్థంతి లేని మహానేత. దేశానికి స్వాతాంత్ర్యం రావడానికి అసలు కారణం బోస్ ఆజాద్ హింద్ ఫౌజేనని నమ్మేవాళ్లు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేతాజీ పేరు చెబితేనే ఎక్కడలేని స్ఫూర్తి వస్తుంది. అలాంటి బోస్ పేరుతో నేతలు రాజకీయం చేయడం అది కూడా బెంగాల్ ఎన్నికల సమయంలో ఆసక్తి రేపుతుంది.

బెంగాల్ ఎన్నికలు అటు బీజేపీకి.. ఇటు తృణమూల్ కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడోసారి అధికారం దక్కించుకోవాలని దీదీ చూస్తోంటే.. ఎలాగైనా మమతను గద్దె దించడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య సంఖ్యలో సీట్లు వచ్చిన దగ్గర్నుంచీ… బెంగాల్ రాజకీయం మారిపోయింది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోచోట ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నేతాజీ జయంతి రావడంతో.. బోస్ పేరు చెప్పుకుని బెంగాలీల మనసులు గెలవాలని అన్ని పార్టీలు పోటీలు పడుతున్నాయి.

బెంగాల్ ఎన్నికలు.. రాష్ట్రంలో ప్రజల చుట్టూ తిరగాలి. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలపై నేతలు మాట్లాడాలి. మమత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రస్తావించి.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బీజేపీ చెప్పాలి. పదేళ్ల పరిపాలనలో బెంగాల్ ఎలా అభివృద్ధి బాట పట్టిందో తృణమూల్ కాంగ్రెస్ చెప్పాలి. కానీ ఇదేమీ లేకుండా నేతాజీ పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని చూడటం ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.

బోస్ అయినా, పటేల్ అయినా, అంబేద్కర్ అయినా, గాంధీ అయినా.. ఆశయాలు సాధించడమే వారికిచ్చే అసలైన నివాళి అని నేతలు గుర్తిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. అంతేకానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతిరత్నాల పేర్లు చెప్పుకుని పాలిటిక్స్ చేయడాన్ని ఎవరికీ మంచిది కాదు. దేశానికి అంతకంటే మేలు చేయదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version