కొంగర కలాన్‌లో నిన్న నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైందని ఓ వైపు టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ సభ విఫలమైందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఇవే వ్యాఖ్యలను చేశారు. కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ పెద్ద ఫ్లాప్ షో అని అన్నారు.
అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. ప్రగతి నివేదన సభను నిర్వహించడంలో టీఆర్ఎస్ ఫెయిలైందని అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ సభ నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. సుమారుగా 25 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా వేశారని, ఆ మేరకు టీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలికారని, కానీ తీరా చూస్తే కేవలం 2.50 లక్షల మంది మాత్రమే సభకు వచ్చారని ఆమె అన్నారు.
ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇచ్చారని డీకే అరుణ ప్రశ్నించారు. అసలు సభ ఉద్దేశం ఏమాత్రమైనా నెరవేరిందా.. అని అడిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక టీఆర్ఎస్ శకం ముగిసినట్లేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని, టీఆర్ఎస్‌కు ఇక ఆ అవకాశం లేదని చెప్పారు. కేసీఆర్ తనకు ఉన్న జన, ధన, బల నిరూపణకే ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారని, అయినప్పటికీ ప్రజల నుంచి సభకు ఆదరణ లభించలేదని అన్నారు.