కేసీఆర్.. చర్చలో నన్ను ఓడించు.. జైలుకైనా సిద్ధమే..?

-

కేసీఆర్.. తెలంగాణ సీఎం ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. ఆయనకు ఎదురే లేదు. మొన్నటి హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆర్టీసీ సమ్మెపై ఆయన వైఖరి విమర్శలకు గురువుతుంది. కార్మికులు వెనక్కి తగ్గినా.. ఏమాత్రం పట్టించుకోకపోవడం మేధావులు, ప్రజాసంఘాల ఆగ్రహానికి గురవుతోంది.

ఈ సమయంలో కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్సీ, ప్రోఫెసర్ కె.నాగేశ్వర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఆర్టీసీ నష్టాలకు కేవలం ప్రభుత్వ విధానాలే కారణమని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే తనతో ఈ విషయమై చర్చకు రావాలని.. ఇందు కోసం ఎవరు వచ్చినా చర్చ జరిపి ప్రభుత్వ విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని రుజువు చేస్తానని సవాల్ విసిరారు.

అది కూడా ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగానే చూపిస్తానని.. వేరే సమాచారం వాడనని కె. నాగేశ్వర్ అన్నారు. ఒకవేళ తాను చెప్పేది తప్పని రుజువు చేస్తే.. అందుకు శిక్షగా చంచల్ గూడ జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన నాయకులే కాదు.. పౌరులకూ అధికారం ఉంటుందని నాగేశ్వర్ గుర్తు చేశారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడాన్ని కే. నాగేశ్వర్ తప్పుబట్టారు. కార్మికులు తమ విలీనం డిమాండ్ ను వదులుకున్నాక కూడా .. సమ్మె 43 రోజులవుతున్నా.. జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చీమ కుట్టినట్టయినా లేకుండా వ్యవహరించడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రభుత్వాధికారమంతా గుప్పిట్లో పెట్టుకోవడం భావ్యం కాదని సూచించారు.

చర్చలు జరిపితే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నా కేసీఆర్ మొండిపట్టుదలకు పోతున్నారని కె. నాగేశ్వర్ విమర్శించారు. అసలు ఈ రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రి ఉన్నారా అని కె. నాగేశ్వర్ నిలదీశారు. మరి ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కె.నాగేశ్వర్ విసిరిన సవాల్ ను కేసీఆర్ ప్రభుత్వం స్వీకరిస్తుందా.. చూడాలి..?

Read more RELATED
Recommended to you

Exit mobile version