సాధారణంగా రెడ్డి సామాజికవర్గం నేతలు రాయలసీమలో ఎక్కువ ఉంటారు..ఇటు కోస్తాకు వస్తే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ కనిపిస్తారు. ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని కాస్త ఆ జిల్లాలోనే ఎక్కువ ఉంటారు. ఇటు కృష్ణా నుంచి చూసుకుంటే రెడ్డి సామాజికవర్గం నేతలు పెద్దగా ఉండరు. అక్కడక్కడ ఉన్నా సరే ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉండరు. కృష్ణా టూ శ్రీకాకుళం వరకు అదే పరిస్తితి. కానీ మధ్యలో తూర్పు గోదావరిలో రెడ్డి నేతలు ఉన్నారు.ఆ జిల్లాలో మొదట నుంచి కొందరు రెడ్డి నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. అనపర్తి నుంచి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డి గెలిచారు. అయితే ఇందులో అనపర్తి నుంచి దశాబ్దాల కాలం నుంచి రెడ్డి నేతల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. 1978 నుంచి అదే సీన్ ఉంది. 1983 నుంచి అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి రెడ్డి వర్గం నేతలు పోటీ పడుతున్నారు.
నల్లమిల్లి-తేతలి ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తోంది. టీడీపీ నుంచి నల్లమిల్లి శేషారెడ్డి పలుమార్లు అనపర్తిలో గెలిచారు. ఇక 2014లో శేషరెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి టిడిపి నుంచి గెలిచారు. ఇక తేతలి రామారెడ్డి పలుమార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో తేతలి బంధువు సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. భారీ మెజారిటీతో ఆయన గెలిచారు.
అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి నల్లమిల్లి, వైసీపీ నుంచి సత్తి సూర్యనారాయణ పోటీ చేయడం ఖాయం. ఈ సారి ఎవరికి వారు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీ బలం కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. అదే సమయంలో టిడిపి పుంజుకోవాల్సి ఉంది. ఒకవేళ జనసేనతో టిడిపికి పొత్తు ఉంటే అనపర్తిలో పోటాపోటి ఉంటుంది. మరి ఈ సారి ఏ రెడ్డి నేత గెలుస్తారో చూడాలి.