కొండా, డీఎస్‌లు రేవంత్ కు హ్యాండ్ ఇచ్చేస్తారా?

-

తెలంగాణ పి‌సి‌సి పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత రెండు పర్యాయాలుగా ఓడిపోతూ అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని ఈ సారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే దిశగా రేవంత్ పనిచేయడం మొదలుపెట్టారు. పైగా తీవ్ర కష్టాల్లో ఉన్న పార్టీని పైకి లేపడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు సొంత పార్టీలోని లుకలుకలకు చెక్ పెడుతూనే మరోవైపు అధికార టీఆర్ఎస్‌పై గట్టిగా పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. ఇదే క్రమంలో పలు భారీ సభలు పెట్టి ప్రజలని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఈ సభల సక్సెస్‌తో ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా నడిచింది. ఇదే క్రమంలో తెలంగాణలోనే అత్యంత సీనియర్ నేత డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వచ్చింది.

అసలు డి. శ్రీనివాస్ దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్‌కు ఆయన దూరమయ్యారు. దీంతో ఆయనతో రేవంత్ భేటీ అయ్యి మళ్ళీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇక డీఎస్ కాంగ్రెస్‌లోకి వస్తారని అంతా అనుకున్నారు. అటు రేవంత్‌తో సన్నిహితంగా ఉండే కొండా కాంగ్రెస్ వైపు వస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఈటలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈటల గెలుపు కోసం కొండా తీవ్రంగా కృషి చేశారు. ఆయన వెనుకే కొండా ఉంటున్నారు. తాజాగా డీఎస్ సైతం ఈటలని కలిశారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే కొండా, డీఎస్‌లు రేవంత్‌కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version