గత కొద్ది రోజులుగా చూసుకుంటే , ఏపీ బిజెపి నాయకుల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టారు. మొదట్లో మూడు రాజధానులకు మద్దతు పలికిన బీజేపీ ఇప్పుడు అమరావతిలో రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకుంది. అంతేకాదు తిరుపతి కేంద్రంగా బిజెపి నాయకుల పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తూ, వైసిపి ప్రభుత్వం పైన , అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ , ప్రజల్లో బిజెపి పై చర్చ జరిగే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇదంతా తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ జనసేన బీజేపీ లలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పటికే ఒక కమిటీని వేసుకున్నారు. కానీ ఆ కమిటీ ప్రకటన రాకముందే, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారు అని ప్రకటించేశారు. ఈ పర్యటన పై జన సైనికులు భగ్గుమన్నారు.
కాకపోతే ఇప్పుడు జనసేన బీజేపీ లు విడివిడిగా ప్రజా సమస్యల విషయంలో పోరాడుతూ వస్తుండడం తో, పొత్తు పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు తిరుపతిలో పోటీ విషయంపై ఎప్పుడూ బిజెపి నాయకులే ప్రకటనలు చేస్తున్నారే తప్ప జనసేన పెద్దగా స్పందించకపోవడంతో ఎక్కడలేని గందరగోళం తలెత్తినట్లు కనిపిస్తోంది.